ట్రైలర్‌ నాకేం అర్థం కాలేదు: వర్మ

10 Mar, 2020 19:07 IST|Sakshi

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌’. ఎన్‌.ఎస్‌.ఈ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షత, మనోజ్‌ నందన్‌, అక్షిత, బెనర్జీ, సంపూర్ణేశ్‌ బాబు, జబర్దస్త్‌ నటులు ఆర్పీ, చమ్మక్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స్‌, జేకే క్రియేషన్స్‌ పతాకంపై రాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను రాంగోపాల్‌ వర్మ సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ గురించి ఆర్జీవీ స్పందిస్తూ.. ‘ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌ అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ ట్రైలర్‌ రూపొందించి విధానం మాత్రం బాగుంది. పదునైన కటింగ్‌తో జెడ్‌ స్పీడ్‌లో ఉంది’ అన్నారు. దీనిపై సోషల్‌ మీడియాలో ఆయన అభిమానులు స్పందిస్తూ వర్మకు టైటిల్‌ వివరించే ప్రయత్నం చేశారు. ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌ అంటే 70ఎమ్‌ఎమ్‌ అని చెప్పుకొచ్చారు. 70 ఎమ్‌ఎమ్‌ను రివర్స్‌లో ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌ అని పెట్టారని అభిప్రాయపడుతున్నారు. మరి ఇదెంతవరకు నిజమన్నది ఆ సినిమా యూనిట్‌కే తెలియాలి. ఇస్మార్ట్‌ దర్శకుడు పూరీజగన్నాథ్‌ సినిమా గురించి మాట్లాడుతూ.. ట్రైలర్‌ తనకు ఎంతగానో నచ్చిందన్నారు. ట్రైలర్‌ కొత్తగా ఉందని, ఇందులో జేడీ తన నటనతో ఇరగదీశాడన్నారు. (కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్‌: వర్మ)

కథానాయకుడు తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తుండగా ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ‘ఒకరోజు నేను అడవిలో వెళుతుంటే సడన్‌గా పులి ఎదురైంది. భయంతో పరిగెట్టాను.. పులి నా వెంట పడింది. పులి నా వెంట పడుతుంది..’ అంటూ డైలాగ్‌ వినిపిస్తుంది. ఇంతలో ఇంటర్వెల్‌ పడుతుంది. సినిమాలో లాగా ట్రైలర్‌లో ఇంటర్వెల్‌ పడటం కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఈ బ్రేక్‌ తర్వాత హీరో తిరిగి మళ్లీ అదే కథను వినిపిస్తాడు. చివరగా.. ‘ఎటువైపు చూసినా చావే.. ఆ చావులన్నింటినీ దాటాలంటే ఎమ్‌ఎమ్‌ఓఎఫ్‌ చూడండి’ అని ముగిస్తాడు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌పై కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ‘తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’ను నిస్సిగ్గుగా కాపీ కొట్టార’ని విమర్శిస్తున్నారు. (సినిమాలో అది ట్రై చేద్దామా)

మరిన్ని వార్తలు