కరణ్‌కు తప్పని సినిమా కష్టాలు

19 Oct, 2016 14:50 IST|Sakshi
కరణ్‌కు తప్పని సినిమా కష్టాలు

కరణ్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని పోలీసులు హామీ ఇచ్చినా.. మళ్లీ మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి మరో హెచ్చరిక జారీచేసింది. మల్టీప్లెక్సులలో ఎక్కడైనా ఆ సినిమాను ప్రదర్శిస్తే బాగోదని హెచ్చరించింది. సినిమాకు వ్యతిరేకంగా తాము నిర్వహించే నిరసన ప్రదర్శనలను అడ్డుకున్నా, సినిమా ప్రదర్శన ఆపేందుకు చేసే తమ ప్రయత్నాలకు విఘాతం కలిగించినా వాళ్లను చితక్కొట్టడం ఖాయమని ఎంఎన్ఎస్ అధికార ప్రతినిధి అమే ఖోప్కర్ తెలిపారు. మహారాష్ట్రలో సినిమాల విడుదల విషయంలో ఎంఎన్ఎస్ ఏం చేయగలదో ఈ సినిమా నిర్మాతలు తెలుసుకుంటారని ఎంఎన్ఎస్ నాయకురాలు షాలినీ ఠాక్రే కూడా అన్నారు.  

ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడే వరకు తాను పాకిస్థానీ నటీనటులతో తాను సినిమాలు చేయబోనని కరణ్ జోహార్ మంగళవారం ఒక వీడియోప్రకటన ద్వారా తెలిపారు. తన సినిమాలో 300 మందికి పైగా భారతీయ సిబ్బంది పనిచేశారని, వాళ్లను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. మరోవైపు సినిమా పంపిణీ హక్కులు దక్కించుకున్న ఫాక్స్ స్టార్ స్టూడియోస్ కూడా కరణ్‌కు మద్దతుగా ముందుకొచ్చింది. భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడిని తాము ఖండిస్తున్నామని, అయితే.. కరణ్ జోహార్ కూడా మంచి దేశభక్తుడని ఆ సంస్థ ప్రతినిధి అన్నారు. అతడి జాతీయతను ఎవరూ ప్రశ్నించలేరన్నారు.

ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో పాకిస్థానీ నటుడైన ఫవాద్ ఖాన్ కేవలం 4 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని, అందువల్ల ఈ సినిమా విడుదల అయ్యేందుకు సహకరించాలని ప్రముఖ దర్శక నిర్మాత ముకేష్ భట్ ఎంఎన్ఎస్‌ను కోరారు. సినిమా మీద ఇప్పటికే చాలా ఖర్చుపెట్టినందున దీపావళి సీజన్‌ను దయచేసి పాడుచేయొద్దని విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలోని సింగిల్ థియేటర్ల యజమానుల సంఘం కూడా తాము ఈ సినిమాను ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో.. సినిమా భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.