మోహన్‌బాబుకు డాక్టరేట్‌ ప్రదానం

5 Oct, 2017 03:00 IST|Sakshi
మోహన్‌ బాబుకు డాక్టరేట్‌ ఇస్తున్న తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు

కొరుక్కుపేట (చెన్నై): ప్రముఖ సినీ నటుడు, విద్యావేత్త ఎం.మోహన్‌బాబుకు చెన్నైలోని డాక్టర్‌ ఎంజీఆర్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఎంజీఆర్‌ వర్సిటీ 26వ స్నాతకోత్స వాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2,197 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అలాగే విద్యారంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గాను ఎం.మోహన్‌ బాబుకు ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. తనకు సినీ జన్మనిచ్చిన రాష్ట్రం తమిళనాడని అన్నారు. దర్శక దిగ్గజం దివంగత దాసరి నారాయణరావు తనకు తొలిసారి అవకాశాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎంజీఆర్‌ పేరు మీదుగా ఉన్న విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ పొందడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంజీఆర్‌ వర్సిటీ వ్యవస్థాపక చాన్స్‌లర్‌ ఏసీ షణ్ముగం, డాక్టర్‌ ఎంజీఆర్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఏసీఎస్‌ అరుణ్‌కుమార్‌తో పాటు మోహన్‌బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న, కుమారుడు మనోజ్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు