ఇంట్లో ఉండండి

31 Mar, 2020 04:57 IST|Sakshi
మోహన్‌బాబు

‘‘ఇప్పటికైనా మీకు అర్థం అయ్యుంటుంది.. ప్రకృతిని గౌరవించాలని. ఏదో ఒక మహత్తర శక్తి మనల్ని నడిపిస్తోందని అర ్థం అయ్యుంటుంది. పెద్దల మాటల్ని గౌరవించకపోతే ఏం నష్టం జరుగుతుందనేది మీకు తెలిసి ఉంటుంది. అయినా కూడా ఓ చిన్న కథ’’ చెబుతా అంటూ సోమవారం ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఓ వీడియో షేర్‌ చేశారు. దాని సారాంశం ఈ విధంగా...

‘‘భారతం, భాగవతం, రామాయణంలను మీరు చదివి ఉంటారు. రామాయణంలో అన్నదమ్ములైన వాలి, సుగ్రీవుడు గొడవపడ్డారు. సుగ్రీవుడు ఓడిపోయాడు.. వెంటనే మళ్లీ వాలిని యుద్ధానికి పిలిచాడు సుగ్రీవుడు. ‘ఏవండీ.. ఇప్పుడే యుద్ధంలో ఓడి వెళ్లాడు సుగ్రీవుడు. రక్తపు మరకలు కూడా ఆరకముందే మళ్లీ మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో ఒక మర్మం ఉంది.. వద్దు’ అని వాలి భార్య అతనితో చెబుతుంది. భార్య అంటే అర్ధాంగి.. ఆమె మాట వినాలి. కానీ వినకుండా యుద్ధానికి వెళ్లాడు వాలి. అంటే.. వినాశకాలే విపరీత బుద్ధి. మంచి రుచించలేదు.

వాలి వెళ్లాడు.. యుద్ధంలో ఓడిపోయాడు.. చనిపోయాడు. సీతాదేవి కూడా అంతే.. లక్ష్మణుడు గీసిన గీత దాటొద్దు అంటే వినలేదు.. దాటింది.. కష్టాలు పడింది. అందుకే పెద్దల మాటలు గౌరవించాలి. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదిగారి నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్నట్లు మీరు ఇంట్లో ఉండండి.. సుఖంగా ఉండండి. ఈ కరోనా వ్యాధి వెళ్లిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు నడుచుకోవద్దని చెబుతున్నా ఎవరూ వినకుండా వాళ్ల ఇష్టప్రకారం నడుచుకుంటున్నారు.. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పెద్దల మాటల్ని గౌరవించినప్పుడే మనం బాగుంటాం, మన ఇరుగు పొరుగు వారు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది.. మొత్తం ప్రపంచం బాగుంటుంది. అతి త్వరలో ఈ కరోనా నుంచి మనందరం తప్పించుకుని క్షేమంగా ఉండాలని, పెద్దల మాటల్ని గౌరవించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నా.

మరిన్ని వార్తలు