సూర్య అద్భుతమైన నటుడు

14 Feb, 2020 00:40 IST|Sakshi
పాట ఆవిష్కరణలో సూర్య, మోహన్‌బాబు, శివకుమార్, సుధ కొంగర

– మోహన్‌బాబు

‘‘తమిళంలో శివాజీ గణేశన్‌ తర్వాత అంత గొప్ప నటుడు శివకుమార్‌. ఆయన కొడుకు సూర్యతో కలిసి ‘ఆకాశమే నీ హద్దురా’లో నటించాను. సూర్య అద్భుతమై నటుడు. అటువంటి కొడుకు ఉన్నందుకు శివకుమార్‌ గర్వపడాలి. దర్శకురాలు సుధ క్రమశిక్షణతో పనిచేస్తారు. ఈ చిత్రం సూపర్‌హిట్‌ సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మోహన్‌బాబు. సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా!’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. అపర్ణా బాలమురళి కథానాయికగా నటించారు.

సూర్య నిర్మించారు. రాజశేఖర కర్పూర, సుందరపాండ్యన్, గునీత్‌ మోంగా, ఆలిఫ్‌ సుర్తి సహ– నిర్మాతలు. ఇందులో మోహన్‌బాబు ఓ కీలక పాత్ర చేశారు. ఎయిర్‌ దక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘పిల్ల పులి..’ అనే పాటను విడుదల చేశారు. ఇప్పటివరకు విమానం ఎక్కని వందమంది చిన్నారులను ఫ్లయిట్‌లో తీసుకెళ్లి ఈ పాటను విడుదల చేయడం విశేషం. జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు.

అనురాగ్‌ కులకర్ణి పాడారు. సూర్య మాట్లాడుతూ– ‘‘2000 సంవత్సరంలో కేవలం ఒక శాతంలోపు వారే ఆకాశంలో విహరించేవారు. కెప్టెన్‌ గోపీనాథ్‌ వచ్చి సామాన్యులు కూడా విమానయానం చేసేలా చేశారు.  మోహన్‌బాబుగారు, నా మధ్య వచ్చే సీన్లు హైలైట్‌గా ఉంటాయి. సు«ధ ఈ సినిమా కోసం దాదాపు పదేళ్లు కష్టపడ్డారు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ క్రెడిట్‌ అయినా ఆమెకే దక్కుతుంది’’ అన్నారు సూర్య. ‘‘మంచి  ఔట్‌పుట్‌ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఈ సినిమా చేస్తున్న సమయంలో మా నాన్నగారు చనిపోయారు. మోహన్‌బాబుగారిని మా నాన్నగా దత్తత తీసుకున్నాను’’ అన్నారు సుధ కొంగర.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా