'బొకేలు, బహుమతులు తీసుకురావద్దు..!'

17 Mar, 2016 14:29 IST|Sakshi
'బొకేలు, బహుమతులు తీసుకురావద్దు..!'

మాట కటువుగా ఉన్నా, తన మనసు మాత్రం వెన్న అని మరోసారి నిరూపించుకున్నారు సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు. ఈ నెల 19న తన పుట్టిన రోజు సందర్భంగా ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా తన పుట్టిన రోజును తిరుపతిలో తాను నెలకొల్పిన విద్యానికేతన్ విద్యాసంస్థల్లో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు ఎంతో మంది శ్రేయోభిలాషుల నుంచి పెద్ద సంఖ్యలో బొకేలు, బహుమతులు అందుతుంటాయి.

అయితే ఈ సారి మాత్రం అలాంటి బహుమతులేవి తీసుకురావద్దని ప్రకటించారు మోహన్ బాబు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇలా వృథా ఖర్చులు చేయొద్దని కోరిన ఆయన ఆ మొత్తాన్ని మిరాకిల్ అనే స్వచ్ఛంద సంస్థకు అందించాలని కోరారు. దాదాపు 3000 మంది అనాథ బాలలను సంరక్షిస్తున్న ఈ సంస్థను ఇటీవల సందర్శించిన మోహన్ బాబు, ఈ నిర్ణయం తీసుకున్నారు. కలెక్షన్ కింగ్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. విద్యానికేతన్ విద్యాసంస్థలు 41వ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా రెండురోజుల పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు మోహన్ బాబు చెప్పారు. తొలిరోజు కార్యక్రమాలకు హీరో వెంకటేష్ హాజరవుతారని ఆయన తెలిపారు. మనతో పాటు, మనపక్కన వాళ్లు కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నట్లు మోహన్ బాబు పేర్కొన్నారు.

>