విర్రవీగితే తొక్కేస్తాడు – మోహన్‌బాబు

29 Jan, 2018 00:53 IST|Sakshi
లక్ష్మి, శ్రియ, విష్ణు, సుబ్బరామిరెడ్డి, నిర్మల, మోహన్‌బాబు, మదన్‌

‘‘మాకు తెలిసిన ఫీల్డ్, వ్యాపారం సినిమా. నటుడిగా పుట్టా. నటుడిగా.. నిర్మాతగా తప్ప వేరే వ్యాపకాలు లేవు. భగవంతుడి ఆశీర్వాదాలతో విద్యాసంస్థ స్థాపించా’’ అని నటులు మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్‌ రామిగాని దర్శకత్వంలో అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు నిర్మించారు. తమన్‌ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రిలీజ్‌ చేశారు.

మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కష్టపడి సినిమా తీశాం. విజయం భగవంతుని ఆశీస్సులతో ఉంటుంది. అలా తీశాం.. ఇలా తీశాం.. అంటుంటాం. కానీ అన్నీ భగవంతుడు చూస్తుంటాడు. ఎంత అణిగి మణిగి ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇస్తాడు. విర్రవీగినప్పుడు ఒక తొక్కు తొక్కుతాడు. దాదాపు 60పైన సినిమాలు తీశాం. జయాలు.. అపజయాలున్నాయి. విజయం వచ్చినప్పుడు విర్ర వీగలేదు.. అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఐదు సినిమాలు హిట్‌ అయినా.. ఒక్క సినిమా ఫ్లాప్‌ అయితే.. ఐదు సినిమాల హిట్టూ పోతుంది. 

నన్ను నటుడిగా పరిచయం చేసిన మా గురువు దాసరి నారాయణరావుగారు ఎంత గొప్ప దర్శకుడో ఈ జనరేషన్‌కి తెలీదు. మహానటుడు ఎన్టీఆర్‌ తర్వాత డైలాగులు చెప్పగలడని నాకు పేరొచ్చిందంటే ఆ క్రెడిట్‌ మా గురువుగారిదే. నన్ను నా వైఫ్‌ నిర్మల ఎప్పుడూ ‘బావా’ అని ప్రేమగా పిలిచేది. కానీ.. ఈ మధ్య పిలవడం లేదు. ఎందుకంటే నాకు సక్సెస్‌ లేదు కదా. సక్సెస్‌ లేకపోతే ఎవరూ పిలవరు (నవ్వుతూ). ‘గాయత్రి’ సినిమాలో శ్రియ నటన చూసి నాకు కౌగిలించుకోవాలని కోరిక ఉండేది. కానీ విష్ణు ఎక్కడ సీరియస్‌ అవుతాడోనని ఊరుకున్నా (నవ్వుతూ).

‘గాయత్రి’ చిత్రంలో విష్ణు తన నటనతో కంటతడి పెట్టించాడు.  సెన్సార్‌ కాకుండా ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్‌ అవుతుందని చెప్పకూడదు. సెన్సార్‌ పూర్తయి అదే తారీఖుకి సినిమా విడుదలవుతుందని.. అవ్వాలని కోరుకుందాం. మదన్‌ ‘గాయత్రి’ సినిమాను అద్భుతంగా తీశాడు. తమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు’’ అన్నారు. ‘‘42 ఏళ్ల కెరీర్‌లో ఓ పాత్రకీ మరో పాత్రకీ సంబంధం లేని పాత్రలు చేశారు మోహన్‌బాబు’’ అన్నారు ఎంపీ, ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి. మదన్‌ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ సినిమాలో ఓ డైలాగ్‌ రాశా.

‘మనుషులను చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు లేదా వ్యాపారి అయినా అవుతాడు’ అని. ఈ సందర్భంలో ఆ డైలాగ్‌ రాయాల్సి వస్తే ‘మనుషులను చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు.. వ్యాపారి అయినా అవుతాడు.. లేదా మోహన్‌బాబుగారిలాగా మహా నటుడైనా అవుతాడు’’ అన్నారు. ‘‘గాయత్రి’లో నా పాత్ర నా కెరీర్‌లో వన్నాఫ్‌ ది మోస్ట్‌ టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది’’ అన్నారు విష్ణు. నటులు కోటా శ్రీనివాసరావు, గిరిబాబు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, డైరెక్టర్‌ బి.గోపాల్, మంచు లక్ష్మి, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు