ఎప్పుడు చూస్తానో!

30 May, 2017 00:09 IST|Sakshi
ఎప్పుడు చూస్తానో!

‘‘రా రా’ చిత్రం టీజర్‌ చాలా బాగుంది. టీజర్‌ చూశాక ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఉత్సుకత మరింత పెరిగింది. ఈ చిత్రం తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ అన్నారు. శ్రీకాంత్, నాజియా జంటగా శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్‌ యూనిట్‌ దర్శకత్వంలో విజయ్‌ నిర్మించిన చిత్రం ‘రా రా’.

ఈ సినిమా టీజర్‌ను మోహన్‌లాల్‌ విడుదల చేశారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ –‘‘వినోదంతో కూడిన హారర్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. తొలిసారి నేను ఈ తరహా చిత్రం చేస్తున్నా. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు ప్రేక్షకులకు పూర్తి వినోదం పంచుతాయి. ఈ సినిమా పాటల వేడుకను విభిన్న రీతిలో జరుపనున్నాం’’ అన్నారు. ‘‘జూన్‌ ప్రథమార్ధంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు విజయ్‌. ఈ చిత్రానికి సంగీతం: రాప్‌ రాక్‌  షకీల్, కెమెరా: పూర్ణ.