త్రీడీలో మన్రో జీవితకథ

14 May, 2014 22:52 IST|Sakshi
త్రీడీలో మన్రో జీవితకథ

సినిమా తారల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా మార్లిన్ మన్రో వంటి  సంచలన తార జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య చాలానే ఉంటుంది. ఈ అద్భుత సౌందర్య రాశి హాలీవుడ్‌లో 17 ఏళ్లు ఓ వెలుగు వెలిగారు. భౌతికంగా ఆమె దూరమై దాదాపు  52 ఏళ్లవుతోంది. అయినప్పటికీ ఆమెను ఎవరూ మర్చిపోలేదు. ఇప్పటికీ అడపా దడపా మన్రో ఫొటోలు, ఆమె వాడిన వస్తువులను వేలం వేస్తుంటారు. వాటిని సొంతం చేసుకోవడానికి భారీ ఎత్తున అభిమానులు పోటీపడుతుంటారు. అలాంటి అభిమానులకు ఓ తీపి వార్త. మన్రో జీవితం ఆధారంగా స్వీయదర్శకత్వంలో రూపేష్ పౌల్ ఓ సినిమా తీయనున్నారు. త్రీడీలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. దీనికి ‘36 ఎంఎం త్రీడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు.

ఈ వారంలో ఫ్రాన్స్‌లో కేన్స్ చలన చిత్రోత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ప్రచార చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు రూపేష్. స్టార్‌గా ఎదగడానికి మన్రో చేసిన కృషి, స్టార్ అయిన తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తదితర అంశాలతో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం కోసం యూనివర్సల్ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని ఇంగ్లిష్, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. మన్రో పాత్రను ఎవరు చేస్తారనేది దర్శకుడు ఇంకా బయటపెట్టలేదు. వాస్తవానికి గత ఏడాదే ఈ చిత్రాన్ని ప్రకటించారు రూపేష్. అప్పట్లో కొంతమంది నటీనటుల పేర్లు కూడా చెప్పారట. ఆ జాబితాలో భారతీయ నటీనటులు లేరని సమాచారం. సో.. మన్రోగా చేయబోతున్నది హాలీవుడ్ తార అని ఊహించవచ్చు.