మేనిఫెస్టో హామీలు నెరవేర్చాలి

23 Mar, 2019 02:55 IST|Sakshi
రాజశేఖర్, నరేశ్, జీవిత, రావు బాల సరస్వతి, జయసుధ, యస్పీ బాలు, శివాజీ రాజా

‘‘మా’ ఎన్నికల సందర్భంగా నరేష్‌ ప్యానెల్‌ ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని హామీలను వారికున్న రెండు సంవత్సరాల కాలంలో నెరవేర్చి, అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి. నూతనంగా ఎన్నికైన వారందరికీ అభినందనలు’’ అని నటులు కృష్ణ అన్నారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన నరేశ్, ఇతర సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేశారు. నటి, దర్శకురాలు విజయ నిర్మల మాట్లాడుతూ– ‘‘మీ అందర్నీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది.

మా ఇంట్లోనే ‘మా’ పుట్టింది. ఈ సంఘం అభివృద్ధి కోసం ఇదివరకు నేను ఇస్తున్న డబ్బుకంటే ఎక్కువే ఇచ్చి ఋణం తీర్చుకుంటాను’’ అన్నారు. నటులు కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘చెన్నైలో ఉన్నప్పుడు కృష్ణగారు, మేము అంతా ‘మా’ అసోసియేషన్‌ని చాలా బాగా నడిపాం. అప్పుడు ఎలక్షన్స్‌ లేవు.. ఇప్పుడు వచ్చాయి. ప్యానెల్‌లోని అందరూ కలిసికట్టుగా పనిచేసి, ‘మా’ అసోసియేషన్‌ ప్రతిష్టని ఎంతో ఎత్తుకు చేర్చాలి’’ అన్నారు.  ‘‘మా’ అంటేనే అమ్మ.

ఈ కళకి కులం, మతం అంటూ భేదం లేదు.. అందరూ కలిసికట్టుగా పనిచేసి, ‘మా’ అభివృద్ధికి కృషి చేయాలి’’ అన్నారు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ‘మా’ నూతన అధ్యక్షుడు నరేష్‌ మాట్లాడుతూ– ‘‘ఈ కార్యక్రమానికి విచ్చేసిన కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, శ్యామల, కోటా శ్రీనివాసరావు, జయసుధ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ‘మా’ అసోసియేషన్‌కి నేను ఇచ్చే మొదటి బహుమతి ‘మా’ గీతం. రెండో బహుమతిగా లక్షా వెయ్యినూటపదహార్లు నా సోదరుల సంక్షేమం కోసం ఇస్తున్నాను.

‘మా’ సభ్యత్వం గతంలో లక్ష ఉండగా 10,000  తగ్గిస్తూ 90,000 చేస్తున్నాం.. ఇది నా మూడో గిఫ్ట్‌.. మా అమ్మ విజయనిర్మలగారు ‘మా’కి ప్రతినెలా 15,000 ఇస్తున్నారు. ‘మా’ లో 24 గంటల హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేసాం. సలహాల పెట్టెను ఏర్పాటు చేసి అందరి విన్నపాలు స్వీకరిస్తాం. మహిళల సాధికారత, సంక్షేమం కోసం జీవితగారి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఈ సందర్భంగా ‘మా’ కోసం అనూప్‌ రూబెన్స్‌ కంపోజ్‌ చేసిన గీతాన్ని కృష్ణ, విజయనిర్మల విడుదల చేశారు.  ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, రాజశేఖర్, జీవిత, ఎస్వీ కృష్ణారెడ్డితో పాటు పలువురు నటీనటులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు