'సినిమా వాళ్లు అద్దాల మేడల్లో ఉంటారు'

1 Oct, 2017 12:28 IST|Sakshi

మా (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు మా అధ్యక్షుడు శివాజీ రాజా పలు నిర్ణయాలను ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన కళాకారులను ఆదుకునేందుకు మా అసోషియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. త్వరలో మా ఆధ్వర్యంలో నిర్మించనున్న వృద్ధాశ్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్ వీ కృష్ణరెడ్డిగారిని చైర్మన్ గా నియమించినట్టుగా ప్రకటించారు.

లక్షలు సంపాదిస్తూ కూడా మూవీ  ఆర్టిస్ట్ అసోషియేషన్ మెంబర్ షిప్ తీసుకొనివారిపై కఠిన చర్యలుంటాయని తెలిపారు. అయితే పేద కళాకరుల విషయంలో మాత్రం మెంబర్ షిప్ తీసుకోక పోయినా పరవాలేదన్నారు. ఇటీవల మరణించిన ప్రొడక్షన్ మేనేజర్ చిరంజీవి కుటుంబానికి మా అసోషియేషన్ తరుపున 6 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. పేద కళాకారుల కోసం మా అధ్యక్షుడు శివాజీ రాజా 25 వేల రూపాయలను మా అసోషియేషన్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్ మాట్లాడుతూ ' సినిమా వాళ్లు అద్దాల మేడల్లో ఉంటారు. అది ఒక్క రాయి వేస్తే పగిలిపోతుంది. మీడియా సినిమా వాళ్ల విషయంలో అత్యుత్సాహం చూపిస్తోంది. ఏ సంఘటన జరిగినా సినిమా వాళ్లు అంటే ఒకటికి పదిసార్తు చూపిస్తున్నారు. ఇది సరైంది కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య ఒక వెబ్ సైట్ లో సినీ ప్రముఖుల గురించి అభ్యంతరకరంగా రాస్తున్నారు. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నా'మన్నారు.

మా అసోషియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకను బాహుబలి వేడుక కన్నా ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఈ వేడుకలో తెలుగు సినీ కళాకారులంతా పాల్గొంటారన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రన్న బీమా, కేసీఆర్ బీమా పేరుతో కళాకారులకు పాలసీలు ఇవ్వబోతున్నారని తెలిపారు. ఆ పాలసీల కోసం రూ. 15 నామినల్ ఫీజు కట్టాలని తెలిపారు.

మరిన్ని వార్తలు