భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...

13 Jan, 2014 00:39 IST|Sakshi
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...
సంక్రాంతి అంటేనే పందేల పండుగ. పది రోజుల ముందే పండుగ హడావిడి మొదలైనా... ఆ శోభకు శ్రీకారం జరిగేది మాత్రం ‘భోగి’ నుంచే. భోగిమంటలతో పోటీల పర్వం మొదలవుతుంది. ఇక ముగ్గుల పందేలతో ఆడవాళ్లు... కోడి పందేలతో మగాళ్లు... గాలిపటాల పందేలతో పిల్లలు... ఇలా చెప్పుకుంటూ పోతే... సర్వం పందేల మయం. వీటి మధ్య సినిమాల పందేలు. అప్పుడే బాక్సాఫీస్ దగ్గర వేడి మొదలైంది. మహేష్ ‘1’, చరణ్ ‘ఎవడు’ రిలీజులు ఇప్పటికే జరిగిపోయాయి. కనుమ దాటి ముక్కనుమకు చేరేసరికి విజయం ఎవరి సొంతమో తేలిపోతుంది. ఈ లోపు సరదాగా ‘భోగి స్పెషల్ సాంగ్స్’ని కాసేపు నెమరు వేసుకుందాం. భోగి పండుగ భోగం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఈ పాటలు నిజంగా తెలుగు దనానికి ప్రతికలే. 
 
భోగిమంటలు(1981)
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... 
భోగిమంటల భోగుల్లో...
తెల్లారకుండానే పల్లెపల్లంతాను 
ఎర్రని కాంతుల భోగుల్లో
తెల్లారకుండానే పల్లెపల్లంతాను 
ఎర్రని కాంతుల భోగుల్లో...
ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాట ఏ రోజు విన్నా... ఆ రోజే భోగి పండుగలా అనిపిస్తుంది. ఇక రమేశ్‌నాయుడు స్వరరచన తెలుగుదనానికి అద్దం పట్టిందనే చెప్పాలి. దీనికి తోడు కృష్ణ, రతి అగ్నిహోత్రిల అభినయం, విజయనిర్మల టేకింగ్ ఈ పాటకు హైలైట్స్. ‘భోగిమంటలు’ సినిమా వచ్చి 33 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఈ పాట శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. బాలు, సుశీల, బృందం ఈ పాటను ఆలపించారు.
 
దళపతి (1992)
సింగారాల పైరుల్లోన 
బంగారాలే పండేనంటా పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగ 
జీవితాలే సాగాలంటా ఆడాలి
ఈనాడు.. ఊరంతటా... రాగాల దీపాలటా..
నీకోసం.. వెలిగేనటా.. ఉల్లాసం.. నీవేనటా.. హోయ్
ఈ పాటను అనువాద గీతమంటే ఎవరైనా నమ్ముతారా? అంతగొప్పగా రాశారు రాజశ్రీ. ‘వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని.. కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకోమంటారా హోయ్. మూలబడివున్నా.. బుట్టా తట్టా తీసి.. భోగిమంటల్లోన నీవే వెయ్యరా..’ అంటూ.. భోగి పండుగ పరమార్థాన్ని రెండే ముక్కల్లో చెప్పారాయన. రాజశ్రీ అక్షరాలకు ఇళయరాజా స్వరరచన తోడైతే.. ఇక చెప్పేదేముంది! శ్రోతలు పులకించక ఏంచేస్తారు? నిజంగానే అంతగా ఆకట్టుకుందీ పాట. పైగా ఈ పాట పాడింది ఎవరనుకున్నారు.. కె.జె.ఏసుదాస్, ఎస్పీబాలు. ఇద్దరూ అగ్రగణ్యులే. పాటకు పట్టాభిషేకం చేసినవారే. ఇక చేసింది తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్‌స్టార్  మమ్ముట్టి. తీసింది మణిరత్నం. ఇంతమంది ఘనాపాటీలు కలిశారు కాబట్టే రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఈ పాటను జనాలు ఇష్టపడుతూనే ఉన్నారు. 
 
రాముడొచ్చాడు (1996)
మా పల్లే రేపల్లెంటా... ఈ పిల్లే రాధమ్మంటా... 
రేగుతుంటే భోగిమంట.. రేగుపళ్ల విందులంటా
రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో
మంచుపూల జల్లులంటా మంచెకాడ గిల్లుడంటా
మంచమేస్తే సంకురాత్రి తిరునాళ్ళో
పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉంటే పండగ.
భోగి పండుగ శోభ అంతా ఈ పాటలోనే కనిపిస్తుంది కదూ! మరి వేటూరా మజాకా. సిటీల్లో పరిస్థితి ఎలా ఉన్నా... పల్లెల్లో యువతరానికి సంక్రాంతి అంటే నిజంగా పెద్ద సంబరమే. పట్టు పరికిణీల్లో అమ్మాయిలూ, టిప్పుటాప్పుగా అబ్బాయిలూ... అలకలు, అల్లర్లు, సరదాలు, సరాగాలు అన్నింటికీ వేదిక సంక్రాంతి. ‘రేగుతుంటే భోగిమంట...రేగుపళ్ల విందులంటా... రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో...’ అని వేటూరి రాసింది అందుకే. ఎస్పీబాలు, చిత్ర, బృందం ఆలపించిన ఈ పాటకు స్వరరచన చేసింది రాజ్. ఆయన సంగీతం సమకూర్చిన హిట్ సాంగ్స్‌లో ఇదీ ఒకటి. ఇక నాగార్జున, సౌందర్యల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా!
 
సిందూరం (1997)
ఏడుమల్లెలెత్తు సుకుమారికి 
ఎంత కష్టమొచ్చింది నాయనో..
భోగిపళ్లు పోయాలి బేబికి.. 
ఏమి దిష్టి కొట్టింది నాయనో..
ముగ్గులెట్టు ముచ్చట్లలో 
ముచ్చెమట్లు పట్టాయిరో...
 
మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గిచుక్కలైనాయిరో...
పల్లెల అందాలు ఏ తీరుగా ఉంటాయో ఈ పాట చూస్తే అర్థమైపోతుంది. అలముకున్న మంచు పొరల మాటున పరుచుకున్న పచ్చదనం,  భగభగ మండుతున్న భోగి మంటలు, పాలపుంతల్ని తలపించే సంక్రాంతి ముగ్గులు. వీటికి దీటుగా అందమైన అమ్మాయిలు. వాళ్లనే టార్గెట్ చేస్తూ సిరివెన్నెల కలం కదిపారు. ఆ అక్షరాలను స్వరబద్ధం చేసే బాధ్యతను సంగీత దర్శకుడు ‘శ్రీ’ తలకెత్తుకున్నాడు. తండ్రి చక్రవర్తిని తలపించాడు కూడా. కృష్ణవంశీకి తెలుగుదనంపై ఉన్న మమకారం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది. ఇక పరికిణీలో సంఘవి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగమ్మాయి కాకపోయినా.. బాపు బొమ్మనే గుర్తుచేసింది. ఇక రవితేజ గురించి తెలిసిందేగా! ఓవరాల్‌గా అందర్నీ రంజింపజేసేసిందీ పాట.
 
సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా పాటలొచ్చాయి కానీ, భోగి పాటలు మాత్రం తక్కువే. అయినా... వచ్చిన ప్రతిపాట అందర్నీ అలరించి, మన సంప్రదాయ విలువలకు అద్దం పట్టింది. కొన్నేళ్లుగా ఇలా పండుగల్ని ప్రతిబింబించే పాటలు సినిమాల్లో కరువయ్యాయి. ‘ట్రెండ్’ అంటూ... క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ, విదేశాల చుట్టూ సినిమా పాట తిరుగుతోంది. మన ‘సోల్’ ఏంటో మనం మరిచిపోతున్న పరిస్థితి ప్రస్తుతం సినిమాల్లో నెలకొని ఉంది. పాశ్చాత్య పోకడలను ప్రతిబింబించే ఈ విధానాలను భోగిమంటల్లో ఆహుతి చేస్తూ... మన సంస్కృతిని ప్రతిబింబించే కొత్తదనాన్ని తెలుగు సినిమా ఆహ్వానించాలని ఆశిద్దాం.