థియేటర్స్‌ క్లోజ్‌ కరోనా 

11 Mar, 2020 09:03 IST|Sakshi

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఈ కరోనా ప్రభావం ఫిల్మ్‌ ఇండస్ట్రీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.  పలు చిత్రాల షూటింగ్స్‌ ఈ వైరస్‌ ప్రభావిత దేశాల్లో క్యాన్సిల్‌ అయ్యాయి. ‘నో టైమ్‌ టు డై’ (జేమ్స్‌బాండ్‌ సిరీస్‌లో 25వ చిత్రం) వంటి హాలీవుడ్‌ సినిమా విడుదల కూడా కరోనా దెబ్బకు వాయిదా పడింది. ఈ సినిమాయే కాదు... ఇటు ప్రాంతీయ సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాల రిలీజ్‌ విషయంలో పునరాలోచనలో పడ్డారు. 

కరోనా వైరస్‌ భయంతో జనం థియేటర్స్‌కు రాకపోతే ఈ ప్రభావం కలెక్షన్స్‌పై పడుతుందని ఆలోచిస్తున్నారు. తాజాగా కేరళలో థియేటర్స్‌  క్లోజ్‌ కరోనా (చెయ్యవా) అనే పరిస్థితి. అక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో బుధవారం నుంచి మార్చి 31వరకు కేరళలో సినిమా థియేటర్స్‌ను క్లోజ్‌ చేయాలని కేరళ ప్రభుత్వం సూచించింది. ‘‘ఈ నెల 16 వరకూ క్లోజ్‌ చేస్తాం. ఆ తర్వాతి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆదేశాలను పాటించి, 31 వరకూ క్లోజ్‌ చేస్తాం’’ అని కేరళ చిత్రనిర్మాతల మండలి అధ్యక్షుడు ఎం. రంజిత్‌ పేర్కొన్నారు. దీంతో మాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా తమ సినిమాల షూటింగ్స్‌కు కాస్త బ్రేక్‌ ఇవ్వాలనుకుంటున్నారట.  

టూర్‌ క్యాన్సిల్‌! 
కరోనా వైరస్‌ ప్రభావంతో ముంబై టూర్‌ను క్యాన్సిల్‌ చేసుకున్నారు హాలీవుడ్‌ స్టార్‌ హీరో క్రిస్‌ హేమ్స్‌వర్త్‌. ఆయన నటించిన ‘ఎక్స్‌ట్రాక్షన్‌ ’(2020) మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్రదర్శకుడు సామ్‌ హార్దేవ్‌తో కలిసి ఈ నెల 16న క్రిస్‌ ముంబై రావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్‌తో క్రిస్‌ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారని ముంబై సినీ వర్గాల కథనం.

మరిన్ని వార్తలు