సినిమాలను టార్గెట్ చేయొద్దు

16 Sep, 2013 00:48 IST|Sakshi
సినిమాలను టార్గెట్ చేయొద్దు
‘‘రాష్ట్రంలో ఏ ఆందోళన జరిగినా ఇతర వ్యాపారాలన్నీ బాగానే ఉంటాయి. సినిమాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఉద్యమాల వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు బాగా నష్టపోతున్నారు. సినిమాల నిర్మాణం కూడా తగ్గే ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే ఎంతో మంది ఉపాధి కోల్పోతారు. 
 
 ఉద్యమం దేనికోసం అయినా కానివ్వండి.. సినిమాని టార్గెట్ చేయకపోతే బాగుంటుంది’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ- ‘‘నవంబర్ 14 నుంచి 20 వరకు  అంతర్జా తీయ బాలల చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇవి రాష్ర్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగేవే అయినప్పటికీ సినీ సంఘాలన్నీ ఇందులో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నాయి. ఇక, చెన్నయ్‌లో జరగనున్న వందేళ్ల సినిమా వేడుక విషయానికొస్తే.. ఆ వేడుకలో పాల్గొనాలా, వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి’’ అని చెప్పారు.
 
 చిన్న సినిమాల గురించి చెబుతూ- ‘‘ధియేటర్లలో ఐదో ఆటకు అనుమతించి, ఒక ఆట చిన్న సినిమాకి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరాం. అలాగే చిన్న సినిమాలను 150 స్క్రీన్లకు పెంచాలని కోరాం. వీటికి ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తోంది. ఇంకా జీవో రావాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు ఎన్వీ ప్రసాద్.