‘అందుకే హృతిక్‌ అలా ఉన్నాడు’

27 Jun, 2019 14:56 IST|Sakshi

హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా సినిమా సూపర్‌ 30. ప్రముఖ గణితవేత్త ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై హృతిక్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. పాత్రకు జీవం పోసేందుకు తన పంథాను మార్చుకుని... పూర్తి డీగ్లామర్‌గా(నలుపు రంగులో) కనిపించి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. అయితే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన అభిమానులు.. హృతిక్‌ నటనను ప్రశంసిస్తూనే లుక్‌ మాత్రం బాగా లేదంటూ పెదవి విరుస్తున్నారు. కాగా ఈ విషయంపై సూపర్‌ 30లో హృతిక్‌ జోడీగా నటిస్తున్న మృణాల్‌ ఠాకూర్‌ స్పందించారు.

ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ..‘ పాత్రకు జీవం పోసేందుకు హృతిక్‌ అలా కనిపించారు. నిజానికి షూటింగ్‌లో హృతిక్‌ను చూస్తుంటే నాకు ఆనంద్‌ గారిని చూసినట్లే అనిపించింది. సినిమా పూర్తయ్యేనాటికి ఆయనను ఆనంద్‌ అని పిలవడం మొదలుపెట్టాను. సినిమా చూసిన తర్వాతే హృతిక్‌ ఎందుకు నల్లగా కనిపించాడో మీకే అర్థమవుతుంది. అసలు నల్లగా కనిపిస్తే ఏమవుతుంది. ‘లవ్‌ సోనియా’ సినిమాలో నేను పూర్తిగా నలుపు రంగుతో, డీ గ్లామరైజ్డ్‌గా కనిపించాను. ఆ క్యారెక్టర్‌ నాకు మంచి గుర్తింపు తెచ్చింది’ అని చెప్పుకొచ్చారు. అందం అనేది వ్యక్తిత్వానికి సంబంధించిందే తప్ప శరీర ఛాయపై అది ఆధారపడి ఉండదని అభిప్రాయపడ్డారు. కాగా బుల్లితెర ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసిన మృణాల్‌ అనతికాలంలోనే హృతిక్‌ సరసన హీరోయిన్‌గా ఎంపికవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

చదవండి : ఆనంద్‌కుమార్‌ అబద్ధాలు.. చిక్కుల్లో ‘సూపర్‌ 30’

ఇక వికాస్‌ భల్‌ దర్శకత్వంలో సాజిద్‌ నడియాద్‌వాలాకు చెందిన నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా సూపర్‌ 30ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తన ‘సూపర్‌ 30’ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా ఎక్కువమంది విద్యార్థులను ఐఐటీలో చేరుస్తున్నట్టు ఆనంద్‌కుమార్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంలో ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని పలువురు ఐఐటీ విద్యార్థులు న్యాయస్థానంలో గత ఏడాది పిల్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదల జాప్యం కానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు