ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీ 'మొఘల్ ఏ ఆజమ్'

18 Jul, 2013 01:15 IST|Sakshi
ఆల్ టైమ్ గ్రేటెస్ట్ మూవీ 'మొఘల్ ఏ ఆజమ్'

వందేళ్ల బారతీయ సినిమా సంబరాలను పురస్కరించుకుని యూకేలో నిర్వహించిన సర్వేలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ చిత్రంగా 1960లో ప్రముఖ చిత్ర దర్శకుడు కే ఆసిఫ్ నిర్మించిన మొఘల్ ఏ ఆజమ్ ఎంపికైంది. దిలీప్ కుమార్, మధుబాల నటించిన మొఘల్ ఏ ఆజమ్ చిత్రానికి మరో ప్రతిష్టాత్మక చిత్రం 'షోలే' గట్టి పోటినిచ్చింది. బ్రిటీష్ ఏషియన్ వీక్లీ న్యూస్ పేపర్ 'ఈస్టర్ ఐ' ఈ సర్వేను నిర్వహించింది.

వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో 'మదర్ ఆఫ్ ఆల్ రొమాంటిక్ ఫిల్మ్స్' అనే ఘనతను సొంతం చేసుకున్న 'మొఘల్ ఏ ఆజమ్' చిత్రం గ్రేటెస్ట్ చిత్రంగా ఎంపికవ్వడం పట్ల కే ఆసీఫ్ కుమారుడు అక్బర్ ఆసీఫ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి అరుదైన గౌరవం దక్కింది అని అక్బర్ వ్యాఖ్యానించారు.

ఈ చిత్ర నిర్మాణం కోసం ఎన్నో త్యాగాలకు సిద్ధపడిన తన తండ్రి శ్రమకు గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు.  విడుదలై 50 దాటిన గాని 'మొఘల్ ఏ ఆజమ్' చిత్రానికి ఆదరణ తగ్గకపోవడం గర్వించాల్సిన విషయమన్నారు. మొఘల్ సామ్రాజ్యంలో యువరాజ్ సలీం, నర్తకి అనార్కలి ప్రేమ కథతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం అప్పట్లో భారీ కలెక్షన్లతోపాటు సంచనల విజయం సాధించింది. ఈ చిత్రాన్ని 2004లో పూర్తి స్థాయి రంగుల చిత్రంగా మార్చి విడుదల చేసిన మంచి స్పందన రావడం విశేషం. 41 ఏళ్ల తర్వాత 2006లో పాకిస్థాన్ లో విడుదలైన తొలి హిందీ చిత్రంగా ఘనత కూడా సాధించింది.

100 గ్రేటెస్ట్ బాలీవుడ్ చిత్రాల జాబితాలో ఎంపికైన టాప్ టెన్ లో 'షోలే', 'దిల్ వాలే దుల్హనియా లేజాయింగే', 'మదర్ ఇండియా', 'ఆవారా', 'దీవార్', '3 ఇడియెట్స్', 'కభీ కభీ', 'అందాజ్', 'మైనే ప్యార్ కియా'లు నిలిచాయి. ఇంకా లగాన్ 11వ స్థానం, కుచ్ కుచ్ హోతా హై 14, ఆరాధన 17, జంజీర్ 23, 'శ్రీ 420' 24వ స్థానంలో నిలిచాయి.