చూడగానే హృదయం బరువెక్కి పోతుంది!

17 Sep, 2014 00:15 IST|Sakshi
చూడగానే హృదయం బరువెక్కి పోతుంది!

సొంత ఊరు అనేది ఓ అందమైన జ్ఞాపకం. జీవనం ఎక్కడ సాగుతున్నా... జీవితాన్నిచ్చిన ఊరుని మాత్రం ఎవరూ మరచిపో(లే)రు. ఉదాహరణకు మిల్కీబ్యూటీ తమన్నానే తీసుకోండి. తాను పుట్టి, పెరిగిన ముంబయ్ మహానగరాన్ని ఆమె ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. ఖాళీ దొరికితే చాలు... ఓ పక్షిలా మారిపోయి ముంబాయిలో వాలిపోతుంటారు తమన్నా. ముంబయ్ అంటే తనకెంత అభిమానమో... ఇటీవల సామాజిక మాధ్యమం  ద్వారా చాలా అందంగా తెలియజేశారామె ‘‘ఎప్పుడూ షూటింగుల పనిమీద గాల్లోనే ప్రయాణిస్తుంటాను. ప్రపంచ దేశాలన్నింటినీ తిరుగుతుంటాను.
 
 ఒక్కోసారి విదేశాల్లో షూటింగులు ముగించుకొని షూటింగ్ నిమిత్తం డెరైక్ట్‌గా చెన్నయ్‌కే వెళ్లిపోవాల్సొస్తుంది. అలాంటప్పుడు కొన్ని విమా నాలు ముంబయ్ మీదుగానే వెళ్తుంటాయి. ఒక్కోసారి ముంబయ్‌లో ల్యాండ్ అవుతుంటాయి కూడా. అప్పుడు చూడాలి నా పరిస్థితి. విండో లోంచి ముంబయ్‌ని చూస్తుంటే.. హృదయం బరువెక్కిపోతుంటుంది. దిగి ఇంటికెళ్లిపోదాం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ... ఏం చేస్తాం? బాధ్యతలు. రాత్రి వేళల్లో విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి ముంబయ్ అందాలను చూస్తుంటే... ‘ఇంతటి గొప్ప మహానగరం నాదేనా!’ అని నాకు తెలీకుండానే ఉద్వేగానికి గురవుతుంటాను’’ అని పేర్కొన్నారు తమన్నా.