నా తండ్రి తప్పుడు మనిషి కాదు

3 Jun, 2018 10:57 IST|Sakshi
కాలా చిత్రంలో రజనీకాంత్‌

కాలా టీమ్‌కు జర్నలిస్ట్‌ లీగల్‌ నోటీసులు

క్షమాపణలు చెప్పకపోతే 101 కోట్లకు దావా!

సాక్షి, ముంబై/చెన్నై: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కాలా చిత్రానికి కష్టాలు కొనసాగుతున్నాయి. కావేరీ జలాలపై రజనీ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో ఈ చిత్రం రిలీజ్‌ కాకుండా అడ్డుకుని తీరతామని కొన్ని సంఘాలు హెచ్చరించాయి. మరోవైపు కాలా కథ తన తండ్రిదేనంటున్న ముంబైకి చెందిన జర్నలిస్ట్‌ జవహర్‌ నాడర్‌, పరువు నష్టం దావా వేస్తానని కాలా నిర్మాతలను హెచ్చరించారు.

కాలా సేట్‌ కథ... ట్యూటికోరిన్‌(తూత్తుకుడి)కి చెందిన ఎస్‌. థిరవియమ్ నాడర్ బెల్లం వ్యాపారి. 1957లో ముంబైలోని ధారావికి వలస వచ్చారు. అతనిని స్థానికులు ‘గుడ్‌వాలా సేట్‌’, ‘కాలా సేట్‌’ అని పిలిచేవారు. అయితే ఇప్పుడు కాలా చిత్రంలో రజనీ పోషిస్తున్న పాత్ర తన తండ్రిదేనని జవహర్‌ వాదిస్తున్నారు. ‘నా తండ్రి కథ అన్న విషయాన్ని దాచిపెట్టి మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పైగా మంచి మనిషిగా పేరున్న నా తండ్రిని తప్పుడు కోణంలో చూపించారు. ఆయన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోను. 36 గంటల్లో రజనీకాంత్‌ సహా చిత్ర యూనిట్‌ మొత్తం లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలి. లేకపోతే రూ. 101 కోట్లకు దావా వేస్తా’ అని ఆయన లేఖలో హెచ్చరించారు. గతంలో కూడా ఆయన ఈ తరహా ఆరోపణలు చేయటం తెలిసిందే.

కాలా టీమ్‌ స్పందన... ఇదిలా ఉంటే జవహర్‌ ఆరోపణలను కాలా చిత్ర యూనిట్‌ తోసిపుచ్చింది. ‘కాలా’ కథకు, థిరవియమ్ నాడార్‌కు అస్సలు సంబంధం లేదని తేల్చి చెప్పింది. నోటీసులు అందాక స్పందిస్తామని పేర్కొంది.  పా రంజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలా’ను నటుడు ధనుష్‌ నిర్మించగా, రజనీకాంత్‌, ఈశ్వరి, నానాపటేకర్‌, సముద్రఖని, హూమా ఖురేషీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 7న కాలా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మరిన్ని వార్తలు