పరిచయం తర్వాత ఏమైంది?

25 Jun, 2017 23:59 IST|Sakshi
పరిచయం తర్వాత ఏమైంది?

వెంకీ, లాస్య జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో దీపక్‌ కృష్ణన్‌ నిర్మించిన సినిమా ‘తొలి పరిచయం’. మురళీ మోహన్, సుమన్‌ కీలక పాత్రధారులు. ఇంద్రగంటి స్వరపరిచిన ఈ సినిమా పాటలను విడుదల చేసిన రాజమండ్రి ఎంపీ, నటుడు మురళీ మోహన్‌ మూడు పాటలు బాగున్నాయని మెచ్చుకున్నారు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘ఈతరం యువత మనోభావాలను ప్రతిబింబించే చిత్రమిది.

ఓ అమ్మాయి, అబ్బాయి పరిచయం తర్వాత ఏమైందనేది చిత్రకథ. వినోదం, కుటుంబ విలువలకు ప్రాముఖ్యత ఇచ్చాం’’ అన్నారు. ‘‘దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ వరసకు నాకు బ్రదర్‌ అవుతారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పాట, పవన్‌కల్యాణ్‌ ‘జనసేన’ పాట నేనే స్వరపరిచా. ఈ సినిమాలో స్వరకర్తగా, గాయకుడిగా, పాటల రచయితగా మూడు పాత్రలు పోషించా’’ అన్నారు ఇంద్రగంటి. ‘మా’ అధ్యక్షులు శివాజీ రాజా, చిత్ర సహ నిర్మాత సురేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.