మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది

21 Jun, 2014 00:22 IST|Sakshi
మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది

ఏ.ఆర్. రెహమాన్
దాదాపు 22 ఏళ్లుగా పాటలు స్వరపరుస్తున్నాను. ఎప్పుడూ నాకు ఒకే వాద్యం ఇష్టం ఉండదు. కాలాన్ని బట్టి నా ఇష్టం మారుతుంది. కొత్త కొత్త వాద్య పరికరాలు ఎన్ని వచ్చినా ఆ భగవంతుడు ఇచ్చిన ‘స్వరం’కి సాటి రావు. అలాగే, ఒక వాద్యం ఉందనుకోండి. దాన్ని ఉపయోగించి మెరుగైన సంగీతం సమకూర్చినప్పుడే దాని విలువ పెరుగుతుంది. లేకపోతే ఆ వాద్యం సాదాసీదాగా మిగిలిపోతుంది.
 
సంగీతానికి భాషతో సంబంధం లేదు. వినోదానికి కూడా అంతే. నా మనసు బాగున్నప్పుడూ పాట.. బాగాలేనప్పుడూ పాటతోనే నా ప్రయాణం. అయితే, ఎప్పుడైనా నా శక్తి తగ్గుతున్నట్లుగానో, మానసిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడో కామెడీ సినిమాలు చూస్తా. తమిళంలో స్టార్ కమెడియన్లుగా వెలిగిన సురుళీ రాజన్, తేంగాయ్ శ్రీనివాసన్, నాగేశ్, ఎస్వీ శేఖర్‌లు చేసిన కామెడీ చూస్తూ పెరిగినవాణ్ణి. ఈ జాబితాలో చార్లీ చాప్లిన్‌ని మిస్ చేస్తే, తప్పు చేసినవాణ్ణవుతా. జనాలను నవ్వించి, ఆనందపరిచిన  వీళ్లంతా ఎంతో గొప్పవాళ్లు.
 
మాటల్లో వ్యక్తీకరించలేని భావాలను పాట ద్వారా చెబుతుంటాం. అందుకే పాట లేని సినిమా నాకు అసంపూర్ణం అనిపిస్తుంది. మన భారతీయ చిత్రాల్లో ఉండే అందమైన విషయాల్లో పాట ఒకటి. విదేశాల్లో పాటలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, నేను పని చేసే విదేశీ చిత్రాల్లో కేవలం నేపథ్య సంగీతానికి మాత్రమే కాకుండా పాటలకు ఆస్కారం ఉండటం నాకు ఆనందంగా ఉంటుంది.
 
నాకు ఇళయరాజా గారి పాటల్లో ఎప్పటికీ నచ్చేది ‘కాట్రిల్ వరుమ్ గీతమ్...’. తమిళ చిత్రం ‘జానీ’ (1980) కోసం ఆయన స్వరపరచిన ఈ పాట ఎవర్ గ్రీన్ అనొచ్చు. నేను ఎక్కువసార్లు పాడుకునే పాటల్లో ఇదొకటి.నన్ను నమ్మే దర్శకుల సినిమాలకు పని చేయడం నాకిష్టం. నాకూ, మణిరత్నానికీ మధ్య మంచి అవగాహన ఉంది. బాలీవుడ్‌లో రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ విషయాన్నయినా సరే ఆయన ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఇక, ఇంతియాజ్ అలీ అయితే ఇప్పటివరకూ మనం చూడని కోణానికి తీసుకెళ్లిపోతారు. సుభా్‌ష్ ఘయ్ గురించి ఏం చెప్పాలి? సూపర్బ్. ఆశుతోష్ గోవారీకర్ అయితే మరుగున పడిపోయిన మన భారతీయ సంగీతాన్ని మళ్లీ తీసుకువచ్చేలా చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది దర్శకులు ఉన్నారు.

నా జీవితంలో ఎప్పటికీ నేను పశ్చాత్తాపానికి గురయ్యే విషయం ఒకటుంది. ప్రపంచం గర్వించదగ్గ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌తో పని చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా ఆయనను కలవాలనుకునేవాణ్ణి. మైకేల్ జాక్సన్ ఏజెంట్ స్నేహితుడు నా ఏజెంట్‌కి ఫ్రెండ్. అతని ద్వారానే మైకేల్‌ను కలిశాను. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత మొదటిసారి కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు నా గురించి నేను పరిచయం చేసుకోవడానికే సరిపోయింది. అప్పుడు నాకు చాలా బెరుకుగా కూడా అనిపించింది.

నేను స్వరపరచిన ‘జయహో..’ గురించి ఆయన మాట్లాడినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఇండియా అంటే తనకు చాలా ఇష్టమని కూడా మైకేల్ చెప్పారు. రెండోసారి కలిసినప్పుడు ‘ఏఆర్.. మనిద్దరం కలిసి ‘వియ్ ఆర్ ది వరల్డ్..’ లాంటి పాట చేద్దాం అన్నారు. నేను రెండోసారి కలిసిన నెలకు ఆయన చనిపోయారు. మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది.
నేనెక్కువగా క్లాసికల్ సాంగ్స్ వింటాను. క్లాసికల్ మ్యూజిక్ వినడం ద్వారా నూతనోత్సాహం వస్తుంది. పాప్ మ్యూజిక్ విన్నప్పుడు ఆ ఫీలింగ్ కలగదు. ఎప్పుడైనా పాప్ సాంగ్స్ వినాలనిపిస్తే, కారులో ప్రయాణిస్తున్నప్పుడు వింటాను. ఇంట్లో ఉన్నప్పుడు రేడియోలో వింటాను. అది కూడా చాలా తక్కువగా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి