నిద్రపోనివ్వని స్వరం...

4 Aug, 2014 01:23 IST|Sakshi
నిద్రపోనివ్వని స్వరం...

  సందర్భం: కిశోర్ కుమార్ జయంతి
ప్రముఖ రచయిత ఆర్.కె. నారాయణ్ రాసిన ‘ది గైడ్’ నవలను దేవానంద్ ‘గైడ్’ పేరుతో సినిమాగా తీశారు. అందులో ‘గాతారహే... మేరా దిల్... తూహీ మేరీ... మంజిల్’ పాట వినగానే నాకు మతిపోయింది. ఎంతంటే కిశోర్ కుమార్ కథాకమామీషు తెలుసుకునేంత వరకూ.... ఆ స్వరం నన్ను నిద్రపోనివ్వలేదు. సినీ ప్రపంచంలో కొన్ని కాంబినేషన్లుంటాయి. రాజ్ కపూర్-ముఖేశ్, షమ్మీకపూర్-రఫీ, ధర్మేంద్ర-మహేంద్ర కపూర్. అయితే అన్ని కాంబినేషన్లూ అన్నిసార్లూ అద్భుతాల్ని సృష్టించలేవు. కాంబినేషన్‌ల పరిధి దాటి ఆకాశపు అంచుల్ని తాకిన గళాల్లో రఫీకీ-కిశోర్‌కీ పోలికలున్నాయి. రఫీ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడు.
 
  కిశోర్ అసలు సంగీత సాధనే చెయ్యలేదు. ఎవరి దగ్గరా కుదురుగా నేర్చుకోలేదు. కిశోర్‌కి తెలిసింది ఒక్కటే... పాటను చిత్తశుద్ధితో పాడడం, పాటకు ప్రాణం పోయడం.హిందీ చలనచిత్రసీమలో 24 శాఖల గురించీ అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరూ అని ప్రశ్నిస్తే, వెంటనే వచ్చే మొదటి జవాబు కిశోర్ కుమార్ గంగూలీ అని. కిశోర్ నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు, రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, స్క్రిప్ట్ రైటర్ కూడా. విషాదాన్ని పలికించడంలో కిశోర్‌ని మించినవారు లేరంటారు. అది వాస్తవం కూడా. కిశోర్ తన స్వీయ దర్శకత్వంలో పాడిన, ‘కోయీ లౌటారే మేరే బీతే హుయె దిన్..’ పాట వింటే కళ్లలోంచి జలజలా అశ్రువులు రాలతాయి.
 
 ఆ సినిమా పేరు ‘దూర్ గగన్ కీ ఛావోం మే’. ‘ఝుమ్రూ’ సినిమాలో ‘కోయీ హమ్ దమ్... నా రహా... కోటీ సహారా... నా రహా...’ పాట వింటుంటే గుండె మౌనంతో నిండిపోతుంది. మళ్లీ అదే కిశోర్‌దా ‘ఏజో, ముహిచ్చిత్ హై’ అని పాట ఎత్తుకుంటే జనాలు వెర్రెత్తిపోరూ..! కిశోర్ పాడిన ‘మేరే సప్‌నోంకీ రాణీ కబ్ ఆయేగీ తూ...’ పాట దేశాన్ని మత్తులో ముంచేసింది. ‘రూప్ తేరా మస్‌తానా’ ఓ సునామీ. ‘మేరే సావ్‌ునేవాలీ ఖిడ్‌కీ మే’ (పడోసన్), ‘ఏకో చతుర్ నార్ బడీ హోషియార్’ పాటల్ని కిశోర్ అభినయిస్తూ పాడుతుంటే ప్రేక్షకులు మరో లోకంలో అడుగెట్టి అటు చెవుల తుప్పూ, ఇటు మనసుల తుప్పూ వదిలించుకున్నారన్నది ముమ్మాటికీ నిజం.
 
 కాంబినేషన్‌కి అతీతంగా ఎదిగిన అత్యంత సహజ గాయకుడు కిశోర్. ఆయనగొంతు మీద ఎస్.డి. బర్మన్‌కి కొండంత నమ్మకం. ఏదో ఓనాడు కిశోర్ అన్ని రికార్డుల్నీ బ్రేక్ చేస్తాడని ఆయనకి తెలుసు. అందుకే తన రెగ్యులర్ కంపెనీ ‘నవ్‌కేతన్’లోనే కాక తను సంగీత దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ ఒక్క పాటైనా ఇచ్చేవారు. మొదట్లో కిశోర్ ఎక్కువగా పాడింది దేవ్ సాబ్‌కి. ఇక ఎస్.డి. బర్మన్, కిశోర్‌ల కాంబినేషన్ ఎన్ని అద్భుత గీతాలు సృష్టించిందంటే, ఆ పాటలు అమరత్వాన్ని పొందేంత. ఇక, కిశోర్ - రాజేష్ ఖన్నాల కాంబినేషన్ తుపాను సృష్టించింది.
 
  ‘ఏ షామ్ మస్‌తానీ మద్‌హోష్ కీయేజా’ పాట యువతని వెర్రెక్కించింది. ‘జిందగీ ఏక్ సఫర్ హై సూరానా’ (అందాజ్)... ఇలా అన్నీ అద్భుతాలే!అప్పటి వరకూ ఉత్తర హిందుస్థాన్‌లో ఎక్కడ, ఎప్పుడు పెళ్లి జరిగినా ‘రాజాకీ ఆయీ హై బరాత్.... రంగేలీ హోగీ రాత్’ (తెలుగులో ‘పందిట్లో పెళ్లవుతున్నదీ... కనువిందవుతున్నదీ’) పాట వినిపించేది. ‘సచ్చాఝాటా’ సినిమా విడుదలయ్యాక ‘మేరీ ప్యారీ బెహనియా బనేగీ దుల్హనియా’ పాట ఒక ట్రెడిషన్‌గా, ‘బారాతీ’ పాటగా మారింది. ప్రతి అన్నా తమ్ముడూ తన సోదరి పెళ్లిలో ఈ పాటే పాడుకున్నారు. అది ‘బేండ్ బాజా’ సాంగ్‌గా ఎంత ప్రసిద్ధి చెందిందంటే, పెళ్లి వాళ్లు, బేండ్ వాళ్ళను ముందే అడిగేవారట, ఆ పాట వాయించడం వాళ్లకు ‘వచ్చా, రాదా’ అని.
 
 కిశోర్ జీవితం ఓ సాగే ప్రవాహం లాంటిది. ఓ కల లాంటిది. కిశోర్ ఎవరికీ అర్థం కాడు. అర్థమయ్యేలా ఏనాడూ ప్రవర్తించలేదు. కొన్ని రహస్యంగా తన మనసులోనే సృష్టించుకున్నాడు. కిశోర్‌లోని అసలు వ్యక్తిని అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి అశోక్ కుమార్... అంటే కిశోర్ పెద్దన్న. ఆయన కిశోర్‌ని తమ్ముడిలా చూడలా... ఒక ‘బిడ్డ’లా అందునా ‘పసిబిడ్డ’లా చూశాడు. అందుకే కిశోర్ ఎంత అల్లరి చేసినా చిరునవ్వుతో భరించేవాడు. ఆయనకి తెలుసు... కిశోర్ లొంగేది ఒక్క ‘ప్రేమ’కి మాత్రమేనని! ఆ ప్రేమ నిజ జీవితంలో దొరికిందో లేదో కిశోర్‌కే తెలియాలి.
 
  కిశోర్ తన గళంతో ఓ ప్రభంజాన్ని సృష్టించాడు. తన అల్లరి చేష్టలతో అందరికీ ప్రియమయ్యాడు. కిశోర్ గురించి లతా అన్నది ‘‘నేను థియేటర్‌కి పాడటానికి వెళ్లగానే కిశోర్ దా ఏదో ఓ అల్లరి చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడని తెలుసు... అందుకే అనేదాన్ని ‘పెహలేగానా... బాద్ మే హస్‌నా’ (ముందు పాట... తర్వాతే అల్లరి) అని. హిందీ చలనచిత్రసీమలో ‘సంగీత విభజన’ చెయ్యాలంటే, ఒకే ఒక్క విధంగా చెయ్యాలి. ‘కిశోర్‌కు ముందు - కిశోర్‌కి తరువాతా’ అని. కిశోర్‌కు ముందు రఫీ లాంటి చరిత్ర సృష్టించిన గాయకులున్నారు. మరి, కిశోర్ తరవాత? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. దీనికి జవాబు బహుశా కొన్ని దశాబ్దాల తరవాత దొరకొచ్చు... దొరక్కపోనూవచ్చు. సినీ సంగీతానికీ, గీతానికీ సహజత్వాన్ని అద్దిన అమరశిల్పి కిశోర్!     
 - భువనచంద్ర (సినీ గీత రచయిత)