ప్రేక్షకులను అలా మోసం చేయాలి

15 Nov, 2019 02:31 IST|Sakshi
రఘు కుంచె

‘‘చాలా రోజులు కష్టపడి ఓ సినిమాను తెరకెక్కిస్తాం. ముందుగా చెప్పిన విడుదల తేదీకే సినిమాను విడుదల చేయాలని కొందరు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌లో రాజీ పడుతుంటారు. అది తప్పు అని నా అభిప్రాయం. సమయం ఉన్నప్పుడు రీ–రికార్డింగ్‌కు మరింత సృజనాత్మకతను జోడించి ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంటుంది’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస్‌ కానూరు నిర్మించారు. సత్యదేవ్, శ్రీరాం, గణేష్‌ వెంకట్రామన్‌ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.  చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ...

► ఓ హత్య నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈషా రెబ్బా పాత్ర చుట్టూ మిగిలిన పాత్రలు తిరుగుతుంటాయి. ఇందులో మూడు పాటలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్రమోషనల్‌ సాంగ్‌. ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాకు శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి పని చేశాను. ‘ఢమరుకం’ మినహా ఆయన ఎక్కువగా హాస్యభరిత చిత్రాలు తీశారు. ‘రాగల 24 గంటల్లో’ చిత్రం థ్రిల్లర్‌ జానర్‌లో ఉంటుంది.

► కెమెరా, నేపథ్య సంగీతం ఈ సినిమాకు రెండు కళ్లు లాంటివి. థ్రిల్లర్‌ చిత్రాల్లో స్క్రీన్‌ ప్లే కూడా చాలా ముఖ్యం. స్క్రీన్‌ప్లే ఉత్కంఠగా సాగేందుకు మంచివారిని చెడ్డవారిగా, చెడ్డవారిని మంచి వారిగా చూపిస్తూ ప్రేక్షకులను మోసం చేయాలి. కొన్నిసార్లు సౌండ్‌తోనే ప్రేక్షకులు థ్రిల్‌ ఫీలయ్యేలా చేయాలి. ఈ సినిమా కోసం దాదాపు 30 రోజులు ఆర్‌ఆర్‌(రీరికార్డింగ్‌) వర్క్‌ చేశాం.  

► ఇప్పటి వరకు 18 సినిమాలకు సంగీతం అందించాను. దర్శకుడికి నచ్చలేదని ఇప్పటి వరకు రెండో ట్యూన్‌ చేసింది లేదు. మొదటి ట్యూనే కరెక్టుగా వచ్చేందుకు కష్టపడతా. నా కెరీర్‌ పట్ల సంతృప్తికరంగానే ఉన్నాను. అనుకున్నంత వేగం లేదు. కానీ, ఏడాదికి రెండుమూడు సినిమాలు చేస్తూ రేస్‌లోనే ఉన్నాను. కొన్ని సార్లు సంగీతం బాగున్నప్పటికీ సినిమా ఆడకపోతే ఆ ప్రభావం సంగీత దర్శకుడిపై పడే అవకాశం ఉంది.  

► ఒక సినిమాకు ఒకరు ఆర్‌ఆర్‌ మరొకరు మ్యూజిక్‌ ఇవ్వడం సరికాదన్నది నా భావన. ఆర్‌ఆర్, మ్యూజిక్‌కు కలిపి ప్యాకేజ్డ్‌గా నేను ఓ సినిమాను ఒప్పుకున్నాను. కానీ ఒకరు జోక్యం చేసుకుని ఆర్‌ఆర్‌ ఇచ్చి, మూవీ బిజినెస్‌ విషయంలోనూ సహాయం చేస్తాననడంతో యూనిట్‌ వారు ఆయనకు అవకాశం ఇచ్చారు. అలా రెండు సినిమాలు  దూరమయినప్పుడు చాలా బాధపడ్డాను.   

► ప్రస్తుతం ‘పలాస’ సినిమాలో నటిస్తూ, సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా విడుదల తర్వాత నటుడిగా నాకు మంచి అవకాశాలు వస్తే తప్పక చేస్తాను.  

మరిన్ని వార్తలు