ఇప్పటికింకా నా వయస్సు 25 ఏళ్ళే !

29 Aug, 2013 02:14 IST|Sakshi
ఇప్పటికింకా నా వయస్సు 25 ఏళ్ళే !
 ‘‘సినిమా అనేది బఫేలాంటిది. బఫేలో ఉన్న అన్ని వంటకాలను అందరూ తినరు. నచ్చినవే తింటారు. అలాగే, ఎవరికి నచ్చిన సినిమాని వాళ్లు చూస్తారు. అందరి నాడీ తెలుసుకోలేం కాబట్టి కథ, పాత్ర బాగున్న సినిమాలను ఎంపిక చేసుకుని చేస్తాను’’ అంటున్నారు చార్మి. చందు దర్శకత్వంలో ఆమె నటించిన ‘ప్రేమ ఒక మైకం’ రేపు విడుదల కానుంది. ఇందులో ‘మల్లిక’ అనే వేశ్య పాత్ర చేశారు చార్మి. తన పాత్రతో పాటు  సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తపరుస్తున్న చార్మీతో జరిపిన ఇంటర్వ్యూ...
 
 పెళ్లెప్పుడు?
 నా వయసు 25 అన్నాను కదా. కెరీర్ మీద కాన్‌సన్‌ట్రేట్ చేయడానికి ఇది మంచి వయసు. 35 ఏళ్లల్లో కెరీర్ గురించి ఆలోచించలేం. కానీ ఆ వయసులో పెళ్లి చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు నా దృష్టంతా కెరీర్ మీదే.
 
 ***  దర్శకుడు చందు ఈ సినిమా గురించి అడిగినప్పుడు ముందు ఒప్పుకోలేదట.. కారణం?
 గతంలో మూడు, నాలుగు సినిమాల విషయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. చెప్పింది ఒకటీ తీసింది ఒకటి. అందుకే నమ్మకం పోయింది. ఈసారి చేదు అనుభవం ఎదురు కాకూడదనుకున్నాను. కానీ చందు చెప్పిన కథ విన్న తర్వాత చేయాలని నిర్ణయించుకున్నాను. కాల్‌గాళ్ కేరక్టర్ కాబట్టి డైలాగ్స్, కాస్ట్యూమ్స్ మరీ ఇబ్బందికరంగా ఉంటాయేమో అన్నాను. అలా ఏం ఉండదని మాటిచ్చారు. నేను కూడా చుడిదార్లే వేసుకుని యాక్ట్ చేస్తానని చెప్పలేదు. అయితే గ్లామరస్ కాస్ట్యూమ్స్ విషయంలో ఓ గీత ఉంటుంది. ఆ గీత దాటకుండా ఉంటే చాలన్నాను.
 
 ***  మరి.. చందు ఈ సినిమాని చెప్పినట్లే తీశారా?
 అలానే తీశారు. ఆయన సినిమాలు మ్యూజికల్ వేలో ఉంటాయి. ‘టెన్త్ క్లాస్’ సినిమా చూసినవాళ్లకి అది తెలుస్తుంది. ఈ సినిమా కూడా అలానే ఉంటుంది. సాంగ్స్, రీ-రికార్డింగ్ అద్భుతంగా కుదిరాయి.
 
 ***  మల్లిక గురించి చెబుతారా?
 ప్రాస్టిట్యూట్, కాల్ గాళ్‌కి మధ్య వ్యత్యాసం ఉంది. కాల్‌గాళ్ తనకు నచ్చినవాళ్లతోనే వెళుతుంది. ఇందులో మల్లిక అలాంటి అమ్మాయే. హైక్లాస్ కాల్‌గాళ్. స్టయిలిష్‌గా ఉంటుంది. తనను మించిన అందగత్తె లేదనుకుంటుంది. ఎవరైనా ఫోన్ చేసి రమ్మంటే, ‘నీ ఫొటో పంపించు. నచ్చితే వస్తా’ అంటుంది. మల్లిక వెరీ బోల్డ్.
 
 ***  మరి.. మల్లిక మహిళలకూ నచ్చుతుందా?
 ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడే మహిళలందరికీ నచ్చేలా తీయాలనుకున్నాం. లేడీస్ అందరూ ఇష్టపడి చూసే విధంగా ఉంటుంది. ఎక్కడా అభ్యంతరకరంగా ఉండదు.
 
 ***  ఈ చిత్రం ఫలితం ఎలా ఉంటుందనుకుంటున్నారు?
 ‘ప్రేమ ఒక మైకం’ చూసిన తర్వాత ప్రేక్షకులు ‘బాగుంది’ అని చిన్న మాట అన్నా చాలు.. ‘హిట్’ అయిపోతుంది. ఆ మాట అంటారనే నమ్మకం ఉంది.
 
 ***  మీరు ప్రివ్యూ చూశారు కదా.. ఎలా అనిపించింది?
 నా మేనేజర్, డ్రైవర్, ఇంకొంతమందితో కలిసి చూశాను. క్లయిమాక్స్‌లో వాళ్లు కంట తడిపెట్టుకున్నారు. కచ్చితంగా ప్రేక్షకులు కూడా కదిలిపోతారనే నమ్మకం ఉంది. ఎంత మంచి సినిమా అయినా, సరైన సమయంలో విడుదల చేయకపోతే.. ప్రేక్షకులకు రీచ్ కాదు. ఈ సినిమాకి పోటీ లేదు. మంచి టైమ్‌లో మంచి థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం కాబట్టి విజయం సాధించడం ఖాయం.
 
 ***  డైలాగ్స్ సంగతేంటి?
 రచయిత పులగం చిన్నారాయణ అద్భుతంగా రాశారు. ఈ సినిమాకి డైలాగ్సే ఓ హీరో అని చెప్పాలి. లొకేషన్లో యాక్ట్ చేసేటప్పుడు, డబ్బింగ్ చెప్పేటప్పుడు డైలాగ్స్‌కి చాలా ఇన్‌స్పయిర్ అయ్యాను. ప్రతి మాటకూ మంచి అర్థం ఉంది.
 
 ***  ఈ సినిమా మీ చుట్టూనే తిరుగుతుందా?
 వాస్తవానికి నాకు పాపులార్టీ ఉంది కాబట్టి నన్ను ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. ఓ సింగర్, రైటర్, కాల్‌గాళ్ చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయి. 
 
 ***  మల్లిక పాత్రతో మరోసారి నంది అవార్డు సాధిస్తావనుకుంటున్నారా?
 మా ఇంట్లో బోల్డన్ని అల్మరాలున్నాయి. నంది వస్తే ఆనందమే.
 
 ***  ఈ మధ్య ఏడు కిలోలు బరువు తగ్గారట. కారణం ఏంటి?
 నా పన్నెండేళ్ల కెరీర్‌లో చాలాసార్లు బరువు తగ్గిన, పెరిగిన సందర్భాలున్నాయి. కానీ అదంతా సినిమాల కోసం, దర్శకులు చెప్పి మీదట చేశాను. ఇప్పుడు నాకోసం తగ్గాను. ఇంకా ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నా. ‘స్మాల్ సైజ్’కి చేరుకున్న తర్వాత మునుపటికన్నా రెట్టింపు ఉత్సాహంగా ఉంది.
 
 ***  పన్నెండేళ్ల కెరీర్‌లో అపజయాల శాతం ఎక్కువే ఉంది. మీరేమంటారు?
 అది నిజమే. పదమూడేళ్ల వయసులో ఇండస్ట్రీకొచ్చాను. అది నిర్ణయాలు తీసుకునే వయసు కాదు కాబట్టి మా అమ్మానాన్న, నా మేనేజర్ సలహా తీసుకునేదాన్ని. వాళ్లు తప్పు చెప్పారనను. ఇప్పుడు నా వయసు 25. నా నిర్ణయాలు నేను తీసుకుంటున్నాను. 
 
 ఎప్పుడైన సందిగ్ధంలో పడ్డప్పుడు నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మేనేజర్ సలహా తీసుకుంటాను. ఇక్కడ సక్సెస్, లక్ రెండూ ముఖ్యం. అదృష్టం నా వెంటే ఉంది. అందుకే... అనుకోకుండా రోజు, మంత్ర, ప్రేమ ఒక మైకం, ఇప్పుడు ప్రతిఘటనలాంటి సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలు చేయడంవల్లే పన్నెండేళ్లయినా ఇంకా సినిమాలు చేయగలుగుతున్నాను. లేకపోతే మూడేళ్లకే కెరీర్ ముగిసిపోయేది.