నా ఫ్లాపులకు నా పొగరే కారణం

26 Apr, 2016 12:03 IST|Sakshi
నా ఫ్లాపులకు నా పొగరే కారణం

ఇటీవలి కాలంలో తన సినిమాలు ఫ్లాప్ కావడానికి తన పొగరే కారణం తప్ప మరేమీ కాదని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. చాలా కాలం తర్వాత ముంబై తిరిగి వెళ్లిన ఆయనను అక్కడి మీడియా ప్రశ్నించినపుడు ఆయనీ సమాధానం చెప్పారు. తాను సినిమాలు త్వరత్వరగా తీసేసి చుట్టేయడం వల్లే అవి ఫ్లాప్ అవుతున్నట్లు కొందరు చెబుతున్నారని, కానీ ఇంతకుముందు తాను తీసిన డిపార్ట్‌మెంట్, ఆగ్ లాంటి సినిమాలకు చాలా సమయం తీసుకున్నా.. అవి కూడా ఆడలేదని గుర్తుచేశారు. సర్కార్ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేశానన్నారు. సత్యకు పెట్టిన బడ్జెట్ చాలా తక్కువని గుర్తుచేశారు. తాను అడవిగుర్రం లాంటివాడినని, చాలా వేగంగా ఉంటానని, తన ఆటవికతను అణిచేసుకోడానికి ప్రయత్నిస్తే, తనలోని విభిన్నత కూడా అణిగిపోతుందని వర్మ అన్నారు. తాను రెండేళ్లలో ఆరు స్క్రిప్టులు పూర్తిచేశాని, దాంతోపాటు వందలాది విదేశీ సినిమాలు చూసి, పునరుత్తేజం పొందానని చెప్పారు. తన పొగరు వల్ల, అతి నమ్మకం వల్ల చేసిన తప్పులన్నీ సరిచేసుకుని.. ఇప్పుడు ముంబైకి వచ్చానని అన్నారు.

ఇక తన కొత్త కార్యాలయం 'కంపెనీ' ఇప్పుడో టూరిస్టు స్పాట్‌లా మారిపోయిందని వర్మ తెలిపారు. కేవలం బాలీవుడ్ నుంచే కాక టాలీవుడ్ నుంచి కూడా చాలామంది వచ్చి చూస్తున్నారని, కొంతమంది అసలు సినిమాలతో సంబంధం లేనివాళ్లు కూడా వస్తున్నారని చెప్పారు. తన మీద ఉన్న పాత ముద్రను పూర్తిగా చెరిపేసుకుని కొత్తతరహాలో కనిపించాలనే ఈ ఆఫీసును కూడా అలా తయారుచేశానన్నారు.