సినిమాను వదిలేది లేదు!

26 Jun, 2016 02:27 IST|Sakshi
సినిమాను వదిలేది లేదు!

ఎన్ని కష్టాలు ఎదురైనా సినిమాను వదలను అంటున్నారు సొగసులన్నీ తనలో ఇముడ్చుకున్న నటి కాజల్‌అగర్వాల్. సుదీర్ఘకాలంగా కథానాయకిగా రాణిస్తున్న అతి కొద్దిమంది నటీమణుల్లో ఒకరు కాజల్. తమిళం, తెలుగు, హిందీ అంటూ నటిగా తన పరిధిని విస్తరించుకున్న ఈ ఉత్తరాది భామకిప్పుడు అవకాశాలు తగ్గుముఖం పట్టాయని, ఇక ఇంటి దారి పట్టే సమయం ఆసన్నమైందన్న ప్రచారం జోరందుకుంది.
 
 అయితే అలాంటి ప్రచారాన్ని కాజల్ కొట్టి పారేశారు. వదల బొమ్మాళి వదలా అన్న చందాన ఎన్ని కష్టాలు ఎదురైనా తాను సినిమాను వదిలేది లేదనీ స్పష్టం చేశారు. దీని గురించి కాజల్‌అగార్వాల్ స్పందిస్తూ సాహసాలు అంటే తనకు చిన్నతనం నుంచీ చాలా ఇష్టం అన్నారు.
 
  ధైర్యం అన్నది తనకు ఈ రంగానికి రాకముందే మెండుగా ఉందన్నారు. అదే తనకు సినిమా వైపు అడుగులు వేయడానికి దోహదపడిందని చెప్పవచ్చు. కొత్త విషయాలను నేర్చుకోవాలి. అసాధ్యం అన్నది సాధ్యం చేసుకోవాలని తపిస్తుంటానన్నారు. తాను పుట్టి పెరిగింది ముంబయిలోనే అయినా కళాశాలలో చదువుకునే రోజుల్లో మేముండే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే ఊర్ల వివరాల గురించి తనకు అస్సలు తెలిసేది కాదన్నారు.
 
 మా ఇంటి చుట్టూ ఉండే ప్రజలే తన లోకంగా భావించేదానినన్నారు. బాహ్య ప్రపంచం గురించి అసలు తెలుసుకునే దానిని కాదని తెలిపారు.అలాంటి పరిస్థితుల్లో నటిగా అవకాశం వచ్చిందన్నారు. ఇంకొకరైతే నటించడానికి అంగీకరించేవారేకాదని, భయపడి పారిపోయేవారని అన్నారు. సహజంగానే తనకు ధైర్యం అధికం కాబట్టి సినిమా వైపు తన పయనం సాగిందని పేర్కొన్నారు.
 
  ఆ ధైర్యమే వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించడానికి ఊతమిచ్చిందన్నారు. తమిళం, తెలుగు భాషల్లో నటించే అవకాశాలు వచ్చాయని, భాషా సమస్య ఎదురైందని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సినిమాను వదిలి వెళ్లేదిలేదనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.ఈ రంగంలో నిత్యం కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటున్నానని, ఇక్కడ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని కాజల్ అంటున్నారు.