ఆ సర్‌ప్రైజ్ మేకప్‌ ఖర్చు ఎంతో తెలుసా?

3 Feb, 2016 18:47 IST|Sakshi
ఆ సర్‌ప్రైజ్ మేకప్‌ ఖర్చు ఎంతో తెలుసా?

అలనాటి బాలీవుడ్ హీరో రిషీ కపూర్‌ తన తాజా సినిమా 'కపూర్ అండ్ సన్స్'లో సరికొత్త లుక్‌తో అభిమానులను విస్మయపరిచారు. ఈ వెటరన్ నటుడు ముఖంపై ముడతలు పడిన కురువృద్ధుడిగా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆయన మేకప్‌ కోసం అక్షరాల రూ. 2 కోట్లు ఖర్చు చేశారట. ఈ విషయాన్ని ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ రిషీ కపూరే వెల్లడించాడు. 'టైటానిక్', 'ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్' వంటి సినిమాలకు పనిచేసిన అమెరికన్ మేకప్ ఆర్టిస్ట్ గ్రెగ్ కానమ్‌ సినిమాలో తనకీ ఈ కొత్త రూపును ఇచ్చినట్టు తెలిపాడు.

'నిజానికి నేనే షాక్‌ తిన్నాను. ఆశ్చర్యపోయాను. ఇదేమంత పెద్ద బడ్జెట్ సినిమా కాదు. నా ముఖాన్ని సరికొత్తగా తీర్చిదిద్దడానికి భారీగా ఖర్చు అయింది. దీనికితోడు మేకప్‌ ఆర్టిస్ట్ ప్రయాణ, బస ఖర్చులు అన్ని కలిపి రూ. 2 కోట్లు వరకు అయింది. రిషీ కపూర్‌కు మేకప్‌ వేయించడానికి ఏ నిర్మాత అయినా ఇంత ఖర్చు పెడతాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది అసాధ్యమైన విషయం. అయితే ఇటీవలికాలంలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా మారుతోంది. ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంది. అందులో నేను భాగం కావడం ఆనందం కలిగిస్తోంది' అని రిషీ చెప్పాడు. 'కపూర్ అండ్ సన్స్' నిర్మాత కరణ్ జోహర్‌దే ఈ క్రెడిట్ అంతా అని ఆయన ప్రశంసల్లో ముంచెత్తాడు.