మాది జన్మజన్మల అనుబంధం

7 Jun, 2017 23:29 IST|Sakshi
మాది జన్మజన్మల అనుబంధం

‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న ‘బాహుబలి 2’ విడుదల వరకూ వెంటాడింది. రిలీజయ్యాక ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇప్పుడు పలు ప్రశ్నలు వెంటాడుతున్నాయి. వాటిలో భల్లాలదేవ రానా భార్య పాత్రధారి ఎవరు? అనే ప్రశ్న ఒకటి. ఈ ప్రశ్నను రానాని డైరెక్ట్‌గా అడిగేశాడు ఓ వ్యక్తి. సోషల్‌ మీడియా ద్వారా రానా తన అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అందరూ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు. గతంలో ‘బాహుబలి’లో మీ భార్య ఎవరు? అని ఒకరు అడిగితే, ‘సరోగసి’ ద్వారా నా కొడుకు భద్ర పుట్టాడంటూ సరదాగా సమాధానం చెప్పి, తప్పించుకున్నారు రానా.

అయితే ఈసారి ఓ అభిమాని ట్విట్టర్‌ వేదికగా రానా ముందు ఈ ప్రశ్న ఉంచాడు. ‘బాహుబలి 2’లో మీ భార్య ఎవరన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే’ అన్నాడు. ‘కాజల్‌’ అంటూ సమాధానమిచ్చాడు రానా. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మజన్మల అనుబంధం’ అంటూ రానా ట్వీట్‌కి ట్విట్టర్‌ ద్వారానే కాజల్‌ సరదాగా సమాధానం ఇచ్చారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.

మరోసారి రాణిగా...
కంగనా రనౌత్‌ లీడ్‌ రోల్‌లో నటించిన బాలీవుడ్‌ ‘క్వీన్‌’ ఎంత హిట్‌ అయిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయాలని తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్‌ రైట్స్‌ కొనుక్కున్నారు. నటి రేవతి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తమన్నా లీడ్‌ రోల్‌లో ఈ చిత్రం తీయనున్నారని గతంలో వార్తలొచ్చాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయి, సినిమా మొదలవుతుందనే టైమ్‌కి ఈ చిత్రం నుంచి తమన్నా తప్పుకున్నారనే వార్త వచ్చింది. ఆమె స్థానంలో కాజల్‌ అగర్వాల్‌ను తీసుకున్నారని తెలిసింది. కాగా పరుల్‌ యాదవ్‌ లీడ్‌ రోల్‌లో రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కన్నడ రీమేక్‌ను ఇప్పటికే స్టార్ట్‌ చేశారట త్యాగరాజన్‌.