చరిత మరువని నటనా చతురత

17 Jan, 2015 22:51 IST|Sakshi
చరిత మరువని నటనా చతురత

 సందర్భం:  ఎన్టీఆర్ వర్ధంతి

 నటులు చాలామందే ఉండవచ్చు. కానీ, భౌతికంగా కనుమరుగైనా కాలానికి అతీతంగా మనసుల్లో చిరంజీవులుగా నిలిచేవారు కొందరే. ‘నటరత్న’ అని అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అభివర్ణించిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అచ్చంగా అలాంటి చిరంజీవి. దానికి కారణం లేకపోలేదు. గణాంకాలను బట్టి చూస్తే, ఆయన నటించిన 300 పైచిలుకు చిత్రాల్లో 123 సాంఘికేతర చిత్రాలే.  (57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు). అన్ని విభిన్న సాంఘికేతర చిత్రాల్లో నటించిన ఒకే ఒక్క హీరో ఆయన. ఏ పాత్ర పోషిస్తే, ఆ పాత్రే ఆయన అన్నట్లుగా అందులో ఒదిగిపోవడం ఈ చిత్రాలన్నిటిలో చూడవచ్చు.
 
పౌరాణిక పాత్రలైతే ఇక చెప్పనే అక్కరలేదు. అందుకే, ఇవాళ్టికీ తెలుగు నాట ఏ పండగ వచ్చినా, టీవీల్లో ప్రత్యేకంగా ఆయన చిత్రాలే కనిపిస్తాయి. సాంఘిక చిత్రాల్లో కూడా దర్శకుడిగా తాను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం, పరమార్థం ఉండేలా చూడడం ఎన్టీఆర్‌లోని విశిష్టత. మరోపక్క 1940ల చివర నుంచి 1980ల దాకా సుదీర్ఘకాలం స్టార్‌గా నిలవడంతో, ఏకంగా 7 తరాల వాళ్లు ఆయనకు నాయిక లయ్యారు. అలాగే, తల్లీకూతుళ్లిద్దరికీ హీరోగా నటించిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. తల్లి సంధ్యతో ‘మాయాబజార్’- కూతురు జయలలితతో ‘కథానాయకుడు’, తల్లి అమ్మాజీతో ‘దైవబలం’ - కూతురు జయచిత్రతో ‘బొబ్బిలిపులి’ మచ్చుకు కొన్ని.
 
గమ్మత్తేమిటంటే, ఆయన పౌరాణిక చిత్రాలు ఇటు టీవీల్లోనే కాక, అటు అప్పటి వీడియో క్యాసెట్లు నుంచి ఇప్పటి డీవీడీల దాకా అమ్ముడవుతూనే ఉన్నాయి. ‘దానవీరశూర కర్ణ’ లాంటి ఆయన చిత్రాల డీవీడీలు, డైలాగ్‌లు ఇవాళ్టికీ హాట్‌కేకులు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్‌ది చెరగని సంతకమనేదందుకే. తెర మరుగైన వెంటనే నటులూ జనం మనసులో నుంచి కనుమరుగయ్యే కాలంలో... కన్నుమూసి 19 ఏళ్ళు నిండిన తరువాత   ఇవాళ్టికీ నిత్యస్మరణీయుడిగా మిగలడం ఆయనకే దక్కిన జన నీరాజనం. అందుకే, ‘దానవీర శూర కర్ణ’లోని డైలాగుల ఫక్కీలోనే చెప్పాలంటే... ‘చరిత మరువదు నీ (నటనా) చతురత, జనం మదిలో నిలిచిన నీకే దక్కును ఎనలేని ఘనత!’