ఇల్లు ఇండియా.. వర్కవుట్‌ అమెరికా!

27 Jul, 2017 03:30 IST|Sakshi
ఇల్లు ఇండియా.. వర్కవుట్‌ అమెరికా!

ప్రతి సినిమాలోనూ లుక్‌ పరంగా, ఫిజిక్‌ పరంగా ఏదో కొత్తదనం చూపించాలని ప్రయత్నించే హీరోల్లో అల్లు అర్జున్‌ ఒకరు. ‘ఆర్య, బన్నీ, హ్యాపీ’ సినిమాల్లో కాలేజ్‌ కుర్రాడిగా మామూలుగా కనిపించిన బన్నీ, ‘దేశముదురు’లో సిక్స్‌ప్యాక్‌ చూపించి ప్రేక్షకులందర్నీ సర్‌ప్రైజ్‌ చేశారు. అప్పట్నుంచి కుదిరిన ప్రతిసారీ కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడా ప్రయత్నంలో భాగంగానే అమెరికా వెళ్లడానికి రెడీ అవుతున్నారు.

అల్లు అర్జున్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించనున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఇందులో అల్లు అర్జున్‌ మిలటరీ అధికారిగా కొత్త లుక్‌లో కనిపిస్తారట. అందుకోసమే ఫిజికల్‌ మేకోవర్‌ కావడానికి ఈ వీకెండ్‌ అమెరికా వెళ్లనున్నారు. ఓ నెల రోజుల పాటు అక్కడే ఓ జిమ్‌లో వర్కౌట్స్‌ చేస్తూ, ట్రైనర్‌ అడ్వైజ్‌ చేసిన డైట్‌ ఫాలో అవుతారని చిత్రబృందం తెలిపింది. అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటించనున్న ఈ సినిమాలో తమిళ హీరోలు అర్జున్, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కె. నాగబాబు, సహనిర్మాత: ‘బన్నీ’ వాసు, సంగీతం: విశాల్‌–శేఖర్‌.