జనవరి 11కు విచారణ వాయిదా

9 Dec, 2017 12:43 IST|Sakshi

సాక్షి, చెన్నై:  నటి జ్యోతిక, దర్శకుడు బాలాలపై కేసు విచారణను కోర్టు జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం నాచ్చియార్‌. ఈ చిత్ర టీజర్‌ ఇటీవల విడుదలపై వివాదాలకు దారి తీసింది. టీజర్‌లో పోలీస్‌ అధికారిగా నటిస్తున్న నటి జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లోని మహిళలపై అసభ్యపదజాలాన్ని వాడినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇండియా కుడియరసు పార్టీ రాష్ట్ర నిర్వాహకుడు దళిత్‌ పాండియన్‌ సమీప కాలంలో కరూర్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

అందులో నాచ్చియార్‌ చిత్ర టీజర్‌లో జ్యోతిక మహిళలను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఆ సంభాషణలు మహిళల మనోభావాలను బాధించేవిగా ఉన్నాయన్నారు. నటి జ్యోతిక, దర్శకుడు బాలాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన తగిన ఆధారాలను, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా పిటిషన్‌దారుడికి ఆదేశాలు జారీ చేశారు. విచారణను జనవరి 11వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. 

పిటిషన్‌దారుడు దళిత్‌ పాండియన్‌ తరఫున హాజరైన న్యాయవాది రాజేంద్రన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో మనోభావాలు దెబ్బతిన్న వారిని, తమ అభిప్రాయాలను వెల్లడించే వారిని, మదర్‌ సంఘాల వారి సాక్ష్యాలను జనవరి 11వ తేదీన కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. అప్పుడు నటి జ్యోతిక, దర్శకుడు బాలాలకు సమస్లు జారీ చేసేలా కోర్టుకు విన్నవిస్తామని తెలిపారు. 
 

మరిన్ని వార్తలు