ఆ కిక్‌ని రిపీట్‌ చేయాలనుకుంటున్నాను

20 Jan, 2020 00:09 IST|Sakshi
నభా నటేష్

‘‘ఒక నటిగా విభిన్న పాత్రలు చేయాలని ఎవరికైనా ఉంటుంది. అయితే అనుకున్నంత మాత్రాన రావు. నాకు మాత్రం కెరీర్‌ మొదట్లోనే డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేసే అవకాశాలు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సినిమా అభిమానిని. కాబట్టి ఏ జానర్‌ సినిమా అయినా నాకు ఇష్టమే’’ అన్నారు నభా నటేష్‌. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కో రాజా’. ఇందులో కథానాయికలు నభా నటేష్, పాయల్‌ రాజ్‌పుత్, తాన్యా హోప్‌ నటించారు. రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్‌ చెప్పిన విశేషాలు.

► ‘డిస్కో రాజా’ చిత్రంలో నేను నభ అనే బ్యాంకు ఉద్యోగిని పాత్రలో నటించాను. ఇంతకుముందు నేను కథానాయికగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’లోని మేఘన, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోని చాందిని పాత్రలతో పోల్చి చూసినప్పుడు నభ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. అనుబంధాలు, ఆప్యాయతలు, విలువలకు ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నభ. నా నిజ జీతానికి కాస్త దగ్గరగా ఉంటుందని చెప్పగలను.

► రవితేజగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన నటించిన ‘విక్రమార్కుడు’, ‘కిక్‌’ సినిమాలు నాకు ఎంతో ఇష్టం. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్‌  ప్రెజన్స్‌ చాలా బాగుంటాయి. షూటింగ్‌ షాట్‌ గ్యాప్‌లో సినిమాల గురించే కాకుండా ఆయన చాలా విషయాలు మాట్లాడతారు. ఫుడ్, లైఫ్‌ స్టైల్‌.. ఇలా సందర్భాన్ని బట్టి మా టాపిక్‌ ఉంటుంది. రవితేజగారితో వర్క్‌ చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను.

► వీఐ ఆనంద్‌గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. కథ నాకు బాగా నచ్చింది. ఇది మాస్‌ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ అనొచ్చు. కానీ రవితేజగారి పాత్ర గురించి ప్రస్తుతం నేను చెప్పలేను. రేపు థియేటర్స్‌లో ఆడియన్స్‌ థ్రిల్‌ ఫీల్‌ అవుతారని మాత్రం చెప్పగలను. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లతో నాకు కాంబినేషన్‌  సీన్స్‌ లేవు. మేజర్‌గా నా సీన్స్‌ అన్నీ రవితేజగారు, ‘సత్యం’ రాజేష్, నరేష్‌గారితోనే ఉన్నాయి.

► యాక్టర్స్‌ అందరూ పెద్ద నిర్మాణ సంస్థల్లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటారు. అవకాశాలే కాదు.. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కూడా వస్తున్నాయి. అందుకు నా దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌ చెబుతున్నాను.

► గత ఏడాది కెరీర్‌ పరంగా నాకు బెస్ట్‌ ఇయర్‌ అని చెప్పవచ్చు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కిక్‌ నుంచి ప్రేక్షకులు నన్ను ఇంకా బయటకు రానివ్వడం లేదు. ఎక్కడికి వెళ్లినా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ పాటలు, డైలాగ్స్‌ వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు ఆదరణతో ఈ ఏడాది కూడా అలాంటి కిక్‌నే రిపీట్‌ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను.

► యువ కథానాయికల మధ్య పోటీ ఉండొచ్చు. అందరూ బాగా చేస్తున్నారు. వారితో పాటు నేనూ ఇంకా కష్టపడాలనుకుంటున్నాను.

► ప్రస్తుతం సాయి తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో హీరోయిన్‌ గా చేస్తున్నాను. అలానే తమిళ, కన్నడ చిత్రాలు చేయడానికి కథలు వింటున్నాను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా