వేంకటేశ్వరుణ్ణి నా స్నేహితునిగానే చూస్తా

8 Jan, 2017 23:37 IST|Sakshi
వేంకటేశ్వరుణ్ణి నా స్నేహితునిగానే చూస్తా

– నాగార్జున
‘‘వేంకటేశ్వరునితో నా అనుబంధం గురించి చెప్పాలి. చిన్నతనంలో అమ్మతో కలసి తొలిసారి తిరుపతి వెళ్లా. అయితే.. ‘అన్నమయ్య’ తర్వాత స్వామితో పరిచయం ఎక్కువ. ఆయన్ను స్నేహితునిగానే చూస్తా. కానీ, ఎప్పుడూ ఏమీ అడగలేదు. మొదటిసారి బాధతో ఒకటి అడిగా. సుస్తీ చేయడంతో అమ్మ చాలా బాధపడింది. అప్పుడు చూడడానికి వెళితే... నన్ను గుర్తు పట్టలేదు. ఏమీ చేయలేక నాన్న ముఖం తెల్లబోయింది. మరునాడు ‘స్వామీ... అమ్మని తీసుకువెళ్లు’ అనడిగితే తీసుకు వెళ్లారు. రెండోసారి నాన్న చివరి చిత్రం ‘మనం’ హిట్టవ్వాలని అడిగా. అదీ జరిగింది. అడిగినవన్నీ ఇస్తుంటే కోరికలు పెరుగుతాయి కదా! ‘నా అబ్బాయిలను బాగా చూసుకోండి’ అనడిగా. నెల తిరిగేలోపు వాళ్లిద్దరికీ స్వామి పెళ్లి కుదిరేలా చేశారు. ఆయనెప్పుడూ నాతోనే, మా ఇంట్లోనే ఉంటారు’’ అన్నారు అక్కినేని నాగార్జున.

ఆయన  హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ.మహేశ్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన పాటల సీడీలను నాగచైతన్య, అఖిల్‌ విడుదల చేశారు. ‘బాహుబలి’ నిర్మాతలు శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ – ‘‘కీరవాణిగారి సంగీతం వింటుంటే కంట్లోంచి నీళ్లు అలా వస్తాయి. ఇందులో ‘కమనీయం..’ పాట చేస్తున్నప్పుడు నా ముందు వేంకటేశ్వరస్వామి, ఆయన  సతీమణులు ఉన్నట్టు.. వాళ్లకి పెళ్లి చేస్తున్నట్టు కలలు వచ్చాయి. అదంతా పాట మహత్యం. హీరోగా అటూ ఇటూ అడుగులు వేస్తున్నప్పుడు ‘ఆఖరి పోరాటం’తో నేను నిలదొక్కుకునేలా చేశారు రాఘవేంద్రరావుగారు. ఆ తర్వాత ‘శివ’, ‘గీతాంజలి’ రకరకాల సినిమాలు చేశా. ‘వాళ్లందరూ గొప్ప సినిమాలు తీశారనుకుంటున్నావా? నేను అంత కంటే గొప్ప సినిమా తీస్తా’ అని ‘అన్నమయ్య’ తీశారు. తర్వాత ‘శ్రీరామదాసు’, ‘శిరిడీసాయి’, ఇప్పుడీ ‘ఓం నమో వేంకటేశాయ’.

ఈ చిత్రం నాకు ఎంత ముఖ్యమంటే... మళ్లీ ఆయనతో పని చేస్తానో లేదో తెలీదు. ‘ఇది నా ఆఖరి చిత్రం’ అని ఆయన నాతో అన్నారు. అది అబద్ధమని అనుకుంటా. నాన్నగారికి ‘మనం’ హిట్టవ్వాలని మనసులో ఎంత కోరుకున్నానో... ఈ చిత్రం కూడా అంత క్లాసిక్‌ హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘అన్నమయ్య’, ‘రామదాసు’, ‘పాండురంగడు’ చిత్రాలు నేను చేస్తాననుకోలేదు. అంతా స్వామి దయే. ఆయన దగ్గరకు వెళ్లినప్పుడల్లా... ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ భక్తుడి కథలే. స్వామి గురించి ఏం తీయలేదనే బాధ ఉండేది. అప్పుడే ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా చేయాలని పించింది’’ అన్నారు రాఘవేంద్రరావు. ‘‘వేంకటేశ్వర స్వామి మా కులదైవం. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు స్వామివారి గురించి చెబుతున్నాం. ఇది మరో ‘అన్నమయ్య’. అంత కన్నా అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు ఏ. మహేశ్‌రెడ్డి.

‘‘ఈ చిత్రంలో చేసింది చిన్న పాత్రే. కానీ, బంపర్‌ ఆఫర్‌ ఏంటంటే... చాలాకాలం తర్వాత నాపై ఓ పాట, అదీ అనుష్కతో చిత్రీకరించారు’’ అన్నారు జగపతిబాబు. ‘‘నాన్నగారి కెరీర్‌ చూస్తుంటే... ట్రెండ్‌ని పట్టించుకోకుండా, ఆయన ట్రెండ్‌లో ఆయన వెళ్తుంటారు. అదో ట్రెండ్‌లా సెట్‌ అవుతుంది. నటుడిగా నాకు ఆయనే స్ఫూర్తి’’ అన్నారు నాగచైతన్య. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, ‘శాంతా బయోటెక్‌’ వరప్రసాద్, అక్కినేని అమల, చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, నటీనటులు అనుష్క, ప్రజ్ఞా జైస్వాల్, సౌరభ్‌జైన్, విమలా రామన్, అస్మిత, ఛాయాగ్రాహకుడు ఎస్‌. గోపాల్‌రెడ్డి, రచయిత జేకే భారవి పాల్గొన్నారు.