నాన్నగారే అలా ప్లాన్‌ చేశారనుకుంటున్నా!

1 Feb, 2017 06:56 IST|Sakshi
నాన్నగారే అలా ప్లాన్‌ చేశారనుకుంటున్నా!

మనసిచ్చిన అమ్మాయి సమంతతో త్వరలో ఏడడుగులు వేయబోతున్న నాగచైతన్య ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. చైతూ, సమంతల నిశ్చితార్థం ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను చైతన్య ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తల్లి లక్ష్మి, మేనమామలు డి. సురేశ్‌బాబు, వెంకటేశ్,  ఇలా తల్లివైపు కుటుంబ సభ్యులతో పాటు తండ్రి వైపు వాళ్లవి, కాబోయే భార్య సమంత కుటుంబం తాలూకు ఫొటోలనూ షేర్‌ చేశారు.  ‘మరచిపోలేని రోజు.. అందరికీ థ్యాంక్స్‌’ అని పేర్కొన్నారు.

‘‘ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి పూజ చేయాలనే నియమాలు పాటించను. చిన్నప్పట్నుంచి నేను భక్తి భావంలో పెరగలేదు. కానీ, భక్తిరస పాత్రలు చేసినప్పుడు నాలో మార్పు వస్తుంది. సంగీతం, సాహిత్యం, సినిమా తీసిన విధానం... నాపై ప్రభావం చూపిస్తాయి. ఆ మార్పు ఏంటని అడిగితే చెప్పడం కష్టం. కానీ, నన్నో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాయి’’ అన్నారు నాగార్జున.కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆయన నటించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదలవుతోంది. నాగార్జున చెప్పిన సంగతులు...


► హాథీరామ్‌ బాబా చరిత్రకి కొన్ని కల్పితాలు జోడించి సినిమా తీశాం. కృష్ణమ్మ (అనుష్క) పాత్ర చరిత్రలో లేదు. రచయిత జేకే భారవి పలు హాథీరామ్‌ బాబా మఠాలను సందర్శించి ఈ కథ సిద్ధం చేశారు. రాఘవేంద్రరావుగారితోనే భక్తి చిత్రాలు ఎందుకు చేస్తున్నారంటే... ఆయన తప్ప ఇతర దర్శకులెవరూ నా దగ్గరకి ఇలాంటి కథలతో రాలేదు. 20 ఏళ్ల క్రితం ‘అన్నమయ్య’, ఇప్పుడీ సినిమా.. ఆయన నన్ను నమ్మారు. ఈ సినిమా చిత్రీకరణలో ‘ఇదే నా చివరి సినిమా’ అనేవారు. అది అబద్ధం అవ్వాలని కోరుకుంటున్నా. ఒకవేళ చివరి సినిమా అయితే, ‘ఆయన వీడ్కోలుకి పర్‌ఫెక్ట్‌ ఫిల్మ్‌’ అని నా ఫీలింగ్‌.

► తిరుమలలో వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకన్న దగ్గరికి ఎందుకు వెళతారు? శేషవస్త్రం ప్రాముఖ్యత ఏంటి? ఇలా చాలా అంశాలు మనకు తెలీదు. కానీ, తిరుపతి వెళ్లి దణ్ణం పెట్టుకుని వస్తాం. తిరుమలేశుడి దర్శనంలో మనం పాటించే నియమాల వెనుక చిన్న కథలను ఈ చిత్రంలో చెప్పాం. ఏదో ప్రవచనాలు చెబుతున్నట్టు కాకుండా వినోదాత్మకంగా ఉంటుంది. భగవంతుడికీ, భక్తుడికీ మధ్య జరిగే సంభాషణలు నవ్విస్తాయి. ఫస్ట్‌ కాపీ చూశా. రెండు గంటలు ఆధ్యాత్మిక ప్రయాణం చేసినట్టే ఉంది.

► 16వ శతాబ్దంలో తిరుమలేశుడి గుడికి బంగారు పూతలేదు. రాతి గుడిలో ఓ అందం ఉంటుంది. ఇప్పుడు మోడ్రన్‌ ఆర్ట్‌ వర్క్‌ పేరుతో చాలా గుళ్లకు రంగులు వేయడం నాకు నచ్చడం లేదు. ఈ చిత్రం కోసం అప్పటి రాతి గుడి సెట్‌ వేయడం, గ్రాఫిక్స్‌లో వైకుంఠం, ఆనంద లోకం, పాల సముద్రం వంటివి సృష్టించ డం సవాల్‌తో కూడుకున్నవే. గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువ ఉండడంతో ఫిబ్రవరికి వస్తుందా? లేదా? అని భయపడ్డా. గ్రాఫిక్స్, సీజీ వర్క్‌ సరిగా లేకుండా ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్‌ కాలేరు.

► ‘ఈ చిత్రాన్ని యువతరం చూస్తారా?’ అనడిగితే... కమర్షియల్‌ చిత్రాలన్నిటికీ డబ్బులు వస్తున్నాయా? కంప్లీట్‌ డిఫరెంట్‌ ఫిల్మ్‌ ఇది. ‘శిరిడి సాయి’ మేం ఊహించిన స్థాయికి చేరుకోలేదు. దాన్ని డాక్యుమెం టరీ తరహాలో తీశాం. ఈ చిత్రాన్ని కమర్షియల్‌ హంగులతో అందరూ చూసేలా తీశాం.

► ‘ఒత్తులు సరిగా పలకండి. మీ భాష బాగోద’ని నాన్నగారు అనేవారు. ‘అన్నమయ్య’ తర్వాత నా తెలుగు ఉచ్ఛారణ మెరుగైంది. ‘ఊపిరి’, ‘ఓం నమో వేంకటేశాయ’.. వంటి చిత్రాలు చేసినప్పుడు ఏదో మంచి విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం.

► ‘మనం’ చిత్రీకరణప్పుడు చై–సామ్‌ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలీదు. ఇద్దరితో నాకు వేర్వేరుగా సీన్స్‌ ఉన్నాయి. మా కాంబినేషన్‌లోని సీన్స్‌లో నాన్నగారు కూడా ఉన్నారు. దాంతో జాగ్రత్త పడినట్టున్నారు. ‘మనం’లో లాస్ట్‌ ఫ్రేమ్‌ గురించి నాన్నగారు ఎంత అందంగా ఆలోచించారనేది... ‘మా అమ్మే ఇప్పుడు నా కూతురైంది’ అని చై–సామ్‌ నిశ్చితార్థం ఫొటో ట్వీట్‌ చేసినప్పుడు అర్థమైంది. అఖిల్‌ పెళ్లాడబోయే అమ్మాయి పేరు శ్రియ. ‘మనం’ లాస్ట్‌ ఫ్రేమ్‌ చూస్తే.. మా ఫ్యామిలీలో అందరి పేర్లు ఉన్నాయి. నాన్నగారే ఆయన చివరి చిత్రంలో అలా ప్లాన్‌ చేశారనుకుంటున్నా!

► ఒక్కోసారి యావరేజ్‌ సినిమా సూపర్‌ హిట్టవుతుంది. ఎలా? అంటే.. ఎవరూ చెప్పలేరు. వేరే సినిమాలు చెత్తగా ఉండొచ్చు లేదా రీలీజైన సీజన్‌ ఓ కారణం కావొచ్చు. కొన్నిసార్లు మంచి సినిమాలు డిజాస్టర్స్‌ అవుతాయి. కానీ, మేమంతా మంచి సినిమా తీయాలని ప్రయత్నిస్తాం. గతేడాది ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదల టైమ్‌లో బాధగా  అనిపించింది. ‘ప్రేమమ్‌’ తర్వాత నాగచైతన్యకి మంచి సినిమా అయ్యేది. అలాంటి సినిమాలు ఆడితే కొత్త కథలొస్తాయి. కానీ, డీమానిటైజేష న్‌ని ఎవరూ ఊహించలేదు. సినిమా డీసెంట్‌గా ఉందన్నా సరిగా ఆడలేదు. ఇప్పుడు కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో చైతన్య చేస్తున్న సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’ తరహాలో ఉంటుంది.

► విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అఖిల్‌ చేయబోయే సినిమా ‘శివ’ టైపులో ట్రెండ్‌ సెట్టింగ్‌ అవుతుందని నా నమ్మకం. ఫిల్మ్‌ మేకింగ్‌ లెక్కలను పూర్తిగా మార్చేసే చిత్రమది. ‘అఖిల్‌’ పెద్ద హిట్టయితే.. ఈ సినిమాకి మరింత హైప్‌ వచ్చేదేమో! కానీ, ఇప్పటికీ హైప్‌ మెయిన్‌టైన్‌ చేయడంలో అఖిల్‌ సక్సెస్‌ అవుతున్నాడు. ‘నువ్వు ఎలా చేస్తున్నావ్‌? రా! నేను నీ దగ్గర నేర్చుకోవాలి’ అన్నాను.

► హారర్‌ సినిమాలు చూడడమంటే ఇష్టం. డిఫరెంట్‌ సినిమాలు చేస్తున్న టైమ్‌లో హారర్‌ కథ నా దగ్గరికి వచ్చింది. మంచి కథ.. ఈ 15న ‘రాజుగారి గది 2’ చిత్రీకరణ ప్రారంభిస్తాం.

► ఈ ఏడాది ఏయన్నార్‌ అవార్డు ఇవ్వనున్నాం. నాన్నగారి పేరు మీద ఓ మ్యూజియం, ఇంకా పలు కార్యక్రమాలు ప్లాన్‌ చేస్తున్నాం.

>