ఇప్పటివరకూ కనీసం ఆమెను కలవనేలేదు!

26 Dec, 2015 22:32 IST|Sakshi
ఇప్పటివరకూ కనీసం ఆమెను కలవనేలేదు!

 ‘‘ఇప్పటివరకూ నేను సున్నా. 2016లో ఓ మెట్టు ఎక్కుతాననే నమ్మకం ఉంది. జనవరి 1న ‘అబ్బాయితో అమ్మాయి’, అదే నెలాఖరున ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలు రిలీజవుతాయి. మరో రెండు సినిమాలు కూడా ఆ ఏడాదే వస్తాయి’’ అని నాగశౌర్య చెప్పారు. రమేశ్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ విడుదల సందర్భంగా ఈ యువహీరోతో చిట్ చాట్.
 
 కొత్త సంవత్సరం మొదటి రోజునే సినిమా రిలీజ్.. ఎలా అనిపిస్తోంది?

 చెప్పాలంటే ఇప్పటివరకూ నేను చేసినా ఐదారు సినిమాలు నాకు బేస్‌మెంట్ అనీ, ‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రంతో కెరీర్ స్టార్ట్ అవుతుందనీ అనిపిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకోదగ్గ కథ ఇది. తల్లిదండ్రులందరూ ‘అభీ మన అబ్బాయి’ అని నన్ను ఓన్ చేసుకునేలా నా పాత్ర ఉంటుంది. యూత్ అంతా నా పాత్రలో తమని చూసుకుంటారు.
 
 మూడేళ్ల క్రితమే దర్శకుడు రమేశ్ వర్మ మీతో ఈ సినిమా చేయాలనుకున్నారు కదా.. అప్పుడెందుకు చేయలేదు?
 అసలీ చిత్రం ద్వారానే నేను పరిచయం కావాల్సింది. కానీ, నిర్మాతలు సరిగ్గా కుదరలేదు. ఆ సమయంలోనే ‘ఊహలు గుసగుసలాడె’కి అవకాశం వచ్చింది. అయితే, ఈ కథను మాత్రం మర్చిపోలేదు. చివరకు మంచి నిర్మాతలు కుదరడంతో ఈ ఏడాది మొదలుపెట్టాం. రమేశ్ వర్మ కథలో కొన్ని మార్పులు చేసి, తీశారు. ఆయన టేకింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది.
 
 ఇళయరాజాగారి పాటలకు కాలు కదిపే అవకాశం రావడం గురించి?
 ఈ చిత్రానికి ఆయన పాటలు ప్రధాన బలం. ఆడియో ఫంక్షన్‌లో ఇళయరాజాగారిని చూసి, థ్రిల్ అయ్యాను. ‘సినిమా బాగుందబ్బాయ్.. మంచి ఫీల్ ఉంది’ అని ఆయన ప్రశంసించడంతో పొంగిపోయాను.
 
 ఇందులో లిప్ లాక్ సీన్స్ చేశారట?
 లిప్ లాక్‌లాంటిది ఉంటుంది కానీ, ప్రాపర్ లిప్ లాక్ అయితే కాదు. ఫొటోషూట్ సమయంలో చేశాం. అయినా నేను లిప్ లాక్ సీన్స్ చేయను.
 
 ఎందుకని?
 ‘జాదుగాడు’ సినిమాలో లిప్ లాక్ చేశాను. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, సెంటిమెంట్‌గా లిప్ లాక్ వర్కవుట్ కాదనుకుంటున్నా.
 

 అప్పటివరకూ లవ్‌స్టోరీస్ చేసి, ‘జాదుగాడు’తో మాస్ హీరోగా నిరూపించుకోవాలనుకున్నారు.. నిరాశే ఎదురైంది కదా?
 అవును. నన్నింకా మాస్ హీరోగా చూడ్డానికి ప్రేక్షకులు రెడీగా లేరని ఆ సినిమా చేశాక అర్థమైంది. ‘జాదుగాడు’ ఫలితం కారణంగా.. మరో రెండు, మూడేళ్ల వరకూ మాస్ చిత్రాల జోలికి వెళ్లకూడదనుకుంటున్నా.
 
 వరుసగా లవ్‌స్టోరీలంటే.. ప్రేక్షకులు మిమ్మల్ని వాటికే ఫిక్స్ చేస్తారేమో?
 నాగార్జునగారు, వెంకటేశ్‌గారు కూడా ముందు లవ్‌స్టోరీస్ చేసి, తర్వాత  మాస్ మూవీస్ చేశారు. ఇప్పుడు నా ఏజ్‌కి తగ్గట్టుగా లవ్ స్టోరీసే చేయాలి. భవిష్యత్తులో మాస్ మూవీస్ చేస్తా.
 
 ఇంతకీ ‘అబ్బాయితో అమ్మాయి’ కథ ఏంటి?
 కొడుకు లవ్‌కి పేరంట్స్ సపోర్ట్ చేస్తారు. ఆ లవ్ తప్పని తెలిశాక ఎలా రియాక్ట్ అవుతారన్నది కథ. ఫేస్‌బుక్‌ది కూడా ఇందులో ఇంపార్టెంట్ రోల్.
 
 మీరు ఫేస్‌బుక్‌లో ఉన్నారా?
 ఫేస్‌బుక్ మాత్రమే కాదు.. ట్విట్టర్‌లోనూ లేను. ఫోన్ కూడా వాడను.
 
 ఫోన్ వాడరా.. మరి ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే?
 ఫోన్ వాడి నాలుగైదు నెలలైంది. నన్ను కాంటాక్ట్ చేయాలంటే నా మేనేజర్‌నూ, లేకపోతే మా అమ్మా, నాన్నకూ ఫోన్ చేయొచ్చు.
 
 ఫోన్ వాడకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారు?
 షూటింగ్ సమయంలో ఫోన్ రింగ్ అయితే, డిస్ట్రబ్ అయిపోతుంటా. అలాగే, ఫోన్ తీయకపోతే ఫ్రెండ్స్‌కీ, ఇంట్లోవాళ్లకీ కోపం వస్తుంది. అందుకే ఫోన్ వాడకూడదని ఫిక్స్ అయిపోయా.
 
 ఎప్పుడైనా లవ్‌లో పడ్డారా.. లవ్ ఫెయిల్యూర్స్ లాంటివి?
 నేను బీకామ్ వరకూ చదువుకున్నాను. స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చింది. నేషనల్ లెవల్‌లో క్రికెట్, టెన్నిస్, బాస్కెట్ బాల్ వంటివి ఆడాను. కాలేజ్‌కి ఎక్కువగా వెళ్లడానికి కుదరకపోవడంతో లవ్‌లో పడే అవకాశం రాలేదు. లవ్ ఫెయిల్యూర్ అంటారా? చాలామంది అమ్మాయిలు నచ్చుతారు. అది ఆకర్షణా? ప్రేమా? పోల్చుకోలేదు. అనుష్క అంటే నాకిష్టం. ఇప్పటివరకూ కనీసం ఆమెను కలవనేలేదు. ఇలాంటివాటిని లవ్ ఫెయిల్యూర్ అనలేం.
 
 మరి.. రాశీఖన్నాతో లవ్ అట?
 ఈ వార్త విని నవ్వుకున్నాను. రాసేవాళ్లకు హక్కు ఉంటుంది. వాటి గురించి మాట్లాడుకునే హక్కు ఇతరులకు ఉంటుంది. సో.. సినిమా పరిశ్రమలో కొనసాగాలంటే... మాట్లాడే మాటలు ఇతరులవి.. వినే చెవులు మాత్రమే మనవి అని ప్రిపేర్ అయిపోవాలి. మా మమ్మీ మాత్రం ‘ఇలాంటి వార్తలు వస్తే... నీకు పెళ్లెలా అవుతుంది?’ అని భయపడుతుంటుంది. అలా అంటే సినిమా పరిశ్రమలో చాలామందికి పెళ్లిళ్లు కావమ్మా అంటుంటాను.

 పారితోషికం కూడా పెంచారట?
 లవ్ అట అని వచ్చిన వార్తకు మనల్ని గుర్తించారని ఆనందపడ్డాను. పారితోషికం పెంచాడట? అనే వార్త కూడా ఉపయోగపడింది. ‘కోటి రూపాయలు ఇవ్వలేం.. 70 లక్షలు తీసుకుంటారా?’ అని ఆ మధ్య ఓ నిర్మాత అడిగారు. అప్పటికి నేనంత కూడా తీసుకోవడంలేదు (నవ్వుతూ).