పాము ప్రేమిస్తే?

21 May, 2019 01:04 IST|Sakshi
శంకర్‌ రావు, ఎల్‌. సురేశ్‌

‘‘ఇప్పటి వరకు వచ్చిన పాము కథా చిత్రాలన్నీ పగ నేపథ్యంలో రూపొందాయి. కానీ, మా ‘నాగకన్య’ చిత్రం పాము నేపథ్య కథావస్తువు అయినప్పటికీ విభిన్నంగా ఉంటుంది. పగతో కాకుండా ప్రేమ నేపథ్యంలో సాగుతుంది’’ అంటున్నారు నిర్మాత కె.ఎస్‌.శంకర్‌ రావు. కమల్‌హాసన్‌ నటించిన తమిళ ‘నీయా’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘నీయా–2’. జై హీరోగా, రాయ్‌లక్ష్మి, వరలక్ష్మీశరత్‌ కుమార్, కేథరిన్‌ థెరిస్సా హీరోయిన్లుగా నటించారు. ఎల్‌.సురేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘నాగకన్య’ పేరుతో లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ పతాకంపై కె.ఎస్‌.శంకర్‌ రావు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ నెల 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. కె.ఎస్‌.శంకర్‌ రావు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘నోము, దేవతలారా దీవించండి, దేవి, అమ్మానాగమ్మ’ వంటి పాము నేపథ్యంలో వచ్చిన చిత్రాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో తెలిసిందే. మా సినిమా కూడా అదే స్థాయిలో హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. పాము కథాచిత్రాలు గతంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాలేదు. మా సినిమానే తొలిసారి విడుదలవుతోంది’’ అన్నారు. ఎల్‌.సురేష్‌ మాట్లాడుతూ– ‘‘నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌. కథ డిమాండ్‌ మేరకే గ్రాఫిక్స్‌ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది’’ అన్నారు.

మరిన్ని వార్తలు