ఫాదర్‌గానా... ఐ కాంట్‌!

23 May, 2017 23:12 IST|Sakshi
ఫాదర్‌గానా... ఐ కాంట్‌!

‘‘నటుడికి ఓ ఇమేజ్‌ ఉండాలని నేనెప్పుడూ అనుకోను. ఒకవేళ ఇమేజ్‌ వస్తే దానికి కట్టుబడి సినిమాలు చేయాలి. చైతూ విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు. మొన్న ‘ప్రేమమ్‌’ చేశాడు. అంతకు ముందు వేరే సినిమాలు చేశాడు. ఇప్పుడో థ్రిల్లర్‌ చేయబోతున్నాడు. ‘రారండోయ్‌..’తో అందరికీ దగ్గరవుతాడు’’ అన్నారు నాగార్జున. కుమారుడు నాగచైతన్య (చైతూ) హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘రారండోయ్‌.. వేడుక చూద్దాం’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున పాత్రికేయులతో ముచ్చటించారు.

► నేను బాగా ఇష్టపడి చేసిన, నాకిష్టమైన సినిమా ‘నిన్నే పెళ్లాడతా’. అలాంటి ఫ్యామిలీ, ఎమోషన్స్‌ ఉన్న సినిమా చైతూకి కావాలని ‘రారండోయ్‌..’ చేశాం. ఇప్పుడు అమ్మాయి–అబ్బాయిల మధ్య రిలేషన్‌షిప్స్, ఎమోషన్స్‌ కంప్లీట్‌ డిఫరెంట్‌గా ఉన్నాయి. తండ్రీకొడుకులు, తండ్రీకూతుళ్ల మధ్య రిలేషన్స్‌ ఎలా ఉన్నాయనేది చూపించాం. చక్కని కమర్షియల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.
►మనకు ఇలాంటి స్నేహితుడు, ప్రేమికుడు ఉండాలనుకునే పాత్రను చైతూ చేశాడు. జగపతిబాబు–చైతూ మధ్య సీన్స్‌ అయితే ఆల్మోస్ట్‌ నేను–చైతూ ఎలా మాట్లాడుకుంటామో అలానే దింపేశాం. ‘మీరే ఆ పాత్ర చెయ్యొచ్చు కదా’ అన్నారు. అఖిల్‌ సినిమాలోనూ ఫాదర్‌గా చేయమన్నారు. (నవ్వుతూ..) ఐ కాంట్‌.
►చైతూకి ఎంత రెమ్యునరేషన్‌ ఇచ్చారు? అని అడగ్గా... ‘‘(నవ్వుతూ) సినిమా అయిన తర్వాత ఇస్తానని చెప్పా. నేను ఇచ్చేదేంటి? ఇదంతా వాళ్లదే కదా!’’ అన్నారు. తనకు ఖర్చులుంటాయి కదా? అంటే... ‘‘అవసరం అయితే అడిగి తీసుకువెళతాడు. సుప్రియను అడగమంటా. తను కరెక్ట్‌గా ఆన్సర్‌ ఇస్తుంది’’.
►‘మన్మథుడి’కి ‘హి హేట్స్‌ విమెన్‌’ అని ట్యాగ్‌లైన్‌ పెట్టాం. సినిమా చూస్తే కంప్లీట్‌ రివర్స్‌లో ఉంటుంది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా? అనడిగితే... ‘‘ట్రైలర్‌లో డైలాగది. సినిమాలో రాజకుమారుడు ఎవరంటే ‘అమ్మాయిని రాణీలా చూసుకునేవాడు’ అనే డైలాగ్‌ ఉంది. స్త్రీలకు సినిమా వ్యతిరేకం కాదు’’
►నిర్మాత అంటే చెక్కుల మీద సంతకం పెట్టడం కాదు. ప్రతి పనినీ దగ్గరుండి చూసుకోవాలి. నాన్నగారు, నాన్నగారి నిర్మాతల నుంచి నేను నేర్చుకున్నది అదే. నేను నిర్మించే ప్రతి సినిమా పనులను దగ్గరుండి చూసుకుంటా. చైతూ, అఖిల్‌ ఇతర సంస్థల్లో చేస్తుంటే నేను వేలు పెట్టను. వాళ్లతో కంటిన్యూస్‌గా సినిమాలు తీసే ఓపిక నాకు లేదు. వాళ్లిద్దరున్నారు, నేను... ఏడాదికి మా సంస్థలో ఒక్కో సినిమా చేయగలమంతే.
►50 కోట్లు ఎక్కడ? 1500 కోట్లు (‘బాహుబలి–2’ వసూళ్లను ఉదహరిస్తూ) ఎక్కడ? కొన్నాళ్లు అందరూ క్లబ్బుల గురించి మాట్లాడడం మానుకోవాలి. గతేడాదే నేను క్లబ్బుల గురించి మాట్లాడ వద్దని చెప్పా. బడ్జెట్‌ ఎంత? వసూళ్లెన్ని! అనేవి చూసుకోవాలి. ‘బాహుబలి’తో రాజమౌళి ‘డ్రీమ్‌ బిగ్‌. యు మైట్‌ అచీవ్‌ ఇట్‌’ అని చెప్పారు. తెలుగు సినిమా క్వాలిటీని పెంచారు. ‘బాహుబలి’కి ముందు ‘అడవి రాముడు, ప్రేమాభిషేకం, మాయాబజార్‌’... ఇలా తెలుగు సినిమావాళ్లు ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉన్నారు.
► ‘మనం’ చేసినప్పట్నుంచి బాగా జోకులేసుకోవడం నాకు, సమంతకు అలవాటు. అప్పుడు ‘సార్‌’ అనేది. ఇప్పుడు ఎలాగోలా ఒప్పించి ‘మామా’ అని పిలిపించుకుంటున్నా.  ‘మామయ్య’ అంటే మరీ ఓల్డ్‌గా ఉంది కదా! అక్టోబర్‌లో చైతూ–సమంతల పెళ్లి ఉంటుంది. ఇంకా డేట్‌ ఫిక్స్‌ కాలేదు.
► ‘విక్రమ్‌’ విడుదలై నేటికి (మంగళవారం) 31 ఏళ్లయ్యిందని నాగార్జునకు గుర్తు చేయగా... ‘‘నిజమా! నాకు నిజంగా గుర్తు లేదు. ఇక్కడికి వస్తుంటే అమల ‘పార్టీ టు నైట్‌’ అని మెస్సేజ్‌ పెట్టింది. ఇందుకే అన్నమాట’’ అన్నారు.
►మోహన్‌లాల్‌ భీముడిగా నటించనున్న ‘మహాభారతం’లో కర్ణుడిగా నటించమని అడిగారు. చిత్రదర్శకుడు శ్రీకుమార్‌ నాలుగేళ్ల నుంచి ‘మహాభారతం’ తీయాలని ప్లాన్‌ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే ‘మీకు ఇంట్రెస్ట్‌ ఉందా? అని నన్ను అడిగారు.
వాసుదేవ్‌ నాయర్‌ నాకు స్క్రీన్‌ప్లే ఇచ్చారు. భీముడి కోణంలో సినిమా తీస్తే నా పాత్రకు ప్రాముఖ్యత ఏముంటుంది? అని శ్రీకుమార్‌ను అడిగితే... ‘‘అన్ని పాత్రలను బాగా ఎస్టాబ్లిష్‌ చేస్తున్నాం’’ అన్నారు. చిన్న క్యారెక్టర్‌ అయినా... ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ అయితే చేస్తానని చెప్పా. ఇంకా డిస్కషన్స్‌లో ఉంది. నేను చేస్తానా? లేదా? అనేది చెప్పలేను.