అలౌకికానందం

10 Feb, 2017 23:16 IST|Sakshi
అలౌకికానందం

వేయి నామాల శ్రీనివాసుడి వైభోగం... నిత్య కళ్యాణం... పచ్చ తోరణం... కనులారా వీక్షించడం తప్ప వర్ణించతరమా? తిరుమలేశుడు కరుణిస్తే... అనుగ్రహిస్తే... వర్ణించ తరమే. అడుగడుగునా ఏడు కొండల్లో ప్రతిధ్వనించే వేంకటేశ్వరడి విశిష్టతలు వర్ణిస్తే.. సాక్షాత్తు స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తే... ఎలా ఉంటుంది? ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలా ఉంటుంది. ‘అన్నమయ్య’లో శ్రీవారి భక్తుడి గురించి చెప్పిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ‘ఓం నమో వేంకటేశాయ’లో హాథీరామ్‌ బావాజీ భక్తుడి చరిత్రతో పాటు కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో నిత్యం జరిగే కైంకర్యాల వెనుక కథను చెప్పారు.

కథేంటి?: దేవుణ్ణి చూడాలనే తపనతో చిన్నప్పుడే దైవాన్వేషణలో ఊరూరు తిరగడం మొదలుపెడతాడు రాజస్థాన్‌ వాసి రామ (నాగార్జున). అనుభవానంద స్వామి (సాయికుమార్‌) వద్దకు చేరుకుంటాడు. ఆ స్వామి అతడికి విద్యాబుద్ధులతో పాటు పాచికలు ఆడటం నేర్పిస్తారు. స్వామి దర్శనం కావాలంటే తపస్సు చేయాలని చెబుతారు. రామ తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి బాలుడి రూపంలో రామ దగ్గరికి వస్తారు. స్వయంగా శ్రీవారే బాలుడి రూపంలో వచ్చారని గుర్తించని రాము, అతణ్ణి వెళ్లిపొమ్మని ఆగ్రహిస్తాడు. గురువు ద్వారా ఆ బాలుడే ఏడుకొండలవాడని తెలుసుకుని, తిరుమలకు చేరతాడు. అక్కడ స్వామి దర్శనం ఎలా అయింది? రామ నుంచి హథీరామ్‌ బాబాజీగా ఎలా మారారు? స్వామివారి నిత్య కైంకర్యాలను ఎలా జరిపించారు? స్వామి చేతుల మీదుగా సజీవ సమాధి ఎందుకయ్యారు? అనేది మిగతా చిత్రకథ.

విశ్లేషణ: తెరపై సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్లముందు ప్రత్యక్షమైన భావన కలుగుతుంది. ప్రతి ప్రేక్షకుడూ తెరపై కనిపిస్తున్న దృశ్యంలో మమేకమై చూసేలా స్వామివారికి బాలాజీ అనే పేరు ఎలా వచ్చింది? ఆయన ఏడు కొండలపై ఎందుకు వెలిశారు?... ఇలా స్థల పురాణంతో పాటు భక్తులకు తెలియని ఎన్నో విషయాలను కమర్షియల్‌ హంగులు జోడించి రాఘవేంద్రరావు ఈ సినిమా తీశారు. రచయిత జేకే భారవి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి, విజువల్‌ ఎఫెక్ట్స్‌ బృందం.. ప్రతి ఒక్కరి నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది. తెర వెనుక బృందం పడిన కష్టం ఒకెత్తయితే... తెరపై నటీనటుల అభినయం మరో ఎత్తు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్, అస్మిత, రావు రమేశ్‌.. అందరూ చక్కగా నటించారు. కానీ, ప్రేక్షకుల కళ్లన్నీ నాగార్జున, సౌరభ్‌ జైన్‌.. పైనే ఉంటాయి.

స్వామివారు నిత్య యవ్వనుడు, అంద గాడు. సౌరభ్‌ జైన్‌ని ఆ పాత్రలో చూడగానే అచ్చంగా ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. హాథీరామ్‌ బాబాగా నాగార్జున అభినయం అద్భుతం. కొన్ని సీన్స్‌లో కంటతడి పెట్టించారు. అన్నమయ్య, శ్రీరామదాసు ఒక ఎల్తైతే హాథీరామ్‌ బాబా పాత్ర మరో ఎత్తు అనే విధంగా నటించారు. భగవంతు డికి, భక్తుడుకి మధ్య వచ్చే సన్నివేశాల్లో నాగార్జున, సౌరభ్‌ జైన్‌లు జీవించారు. థియేటర్‌లో ఓ సినిమా చూస్తున్నట్టు కాకుండా... తిరుమలేశుడి చరిత్ర తెలుసుకుంటున్న ఓ అలౌకిక ఆనందం కలుగుతుంది.