అనూప్‌కు థ్యాంక్స్‌ చెప్పిన నాగ్‌

13 May, 2020 15:10 IST|Sakshi

అక్కినేని నాగార్జున హీరోగా మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘క్రిమినల్‌‌’. మనీషా కోయిరాల, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించారు. పాతికేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సంగీతం దిగ్గజం ఎమ్‌ఎమ్‌ కీరవాణి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ‘తెలుసా మనసా’ సాంగ్‌ ఎవర్‌ గ్రీన్‌ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పాతికేళ్లు పూర్తిచేసుకుంది. అయితే ఈ సినిమా, ఈ సినిమాలోని తెలుసా మనసా పాట మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. 

సినిమా విడుద‌లై పాతికేళ్లు అవుతున్న సంద‌ర్భంగా అనూప్ శంక‌ర్ ఈ పాట‌ను తెలుగు, హిందీ భాష‌ల్లో పాడి నిస్వార్ధంగా స‌మాజానికి సేవ చేస్తున్న వారికి అంకిత‌మిస్తున్నట్లు తెలిపాడు. దీనిపై హీరో నాగార్జున కూడా స్పందించారు. ఈ పాటను నిస్వార్ధ సేవ చేస్తున్న వారికి అంకితం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కీరవాణి స్వరపరచిన ఈ అందమైన పాట 25 ఏళ్లు పూర్తి చేసుకుంది అంటూ నాగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇక తెలుసా మనసా పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించగా, పాటను బాలు, చిత్ర అద్భుతంగా ఆలపించారు. 


చదవండి:
రేపే హీరో నిఖిల్‌-పల్లవి వివాహం?
పవన్‌ కల్యాణ్‌.. ‘ఇప్పుడే మొదలైంది’?

మరిన్ని వార్తలు