వాళ్లకు మళ్లీ టైమ్‌ వచ్చింది

2 Aug, 2018 00:33 IST|Sakshi
నాగార్జున

‘‘సుశాంత్‌ హీరో అని ‘చి..ల..సౌ’ చిత్రంలో నేను భాగస్వామ్యం కాలేదు. సినిమా చూశా. నచ్చింది. సింపుల్‌ పాయింటే అయినా కట్టిపడేసేలా తెరకెక్కించారు. ఆర్టిస్ట్‌ల నటన, స్క్రీన్‌ప్లే, రైటింగ్‌ అన్నీ పక్కాగా కుదిరాయి’’ అని నాగార్జున అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్‌ బ్యానర్స్‌పై రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల..సౌ’. నాగార్జున, జస్వంత్‌ నడిపల్లి, భరత్‌కుమార్‌ మలశాల, హరి పులిజ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు.

► నాగచైతన్య ‘చి..ల..సౌ’ చూసి, బాగుందని నన్నూ చూడమంటే ఇంట్రెస్ట్‌ లేదు అన్నా. ఎందుకంటే.. డైరెక్టర్‌ రాహుల్, నిర్మాతలు, హీరోయిన్, మ్యూజిక్‌ డైరెక్టర్‌.. అంతా కొత్తవారే. పైగా కథ తెలీదు. అందుకే నెగటివ్‌ మైండ్‌తో వెళ్లా. సినిమా స్టార్ట్‌ అయిన ఐదు నిమిషాలకే నెగటివ్‌ మైండ్‌ పోయింది. సినిమా చూశాక నాకు నేనే ఫ్రెష్‌గా అనిపించా.

► సినిమా చూశాక రాహుల్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం అన్నాను. తను హ్యాపీగా ఫీలయ్యాడు. మా బ్యానర్‌లో ‘చి..ల..సౌ’ విడుదల చేయడం గర్వంగా ఉంది.

► అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్కే. నిర్మాతలు మంచి ఆకలితో ఈ సినిమా చేశారు. ఈ మధ్య ఫ్రెష్‌ సబ్జెక్ట్స్‌ బాగా ఆడుతున్నాయి. స్టోరీ రైటర్స్, డైలాగ్‌ రైటర్స్‌కి మళ్లీ టైమ్‌ వచ్చింది. ‘మహానటి, రంగస్థలం’ సినిమాల్లో నటన పక్కన పెడితే మంచి రైటింగ్‌ కనపడింది. ఈ మధ్య హిందీలో ‘రాజీ’ చూశాను. చాలా బాగుంది.

► సుశాంత్, రుహాని నటన సూపర్బ్‌. నా కోసం ఓ కథ రెడీ చేయమని రాహుల్‌కి చెప్పా. ‘చి..ల..సౌ’ రిజల్ట్‌ ఎలా ఉన్నా తన తర్వాతి సినిమా మా బ్యానర్‌లోనే ఉంటుంది. బ్యాకింగ్‌ లేక మంచి సినిమాలు చాలా వరకూ ఆగిపోతున్నాయి. అలాంటి సినిమాలకు అన్నపూర్ణలో బ్యాకింగ్‌ ఇవ్వనున్నాం.

► నేను బాలీవుడ్‌కి వెళ్లలేదు. వాళ్లే నా దగ్గరకు వచ్చారు (నవ్వుతూ). అయాన్‌ ముఖర్జీ, కరణ్‌ జోహార్‌ వచ్చి అడిగితే ‘బ్రహ్మాస్త్ర’ చేశా. తమిళంలో మంచి అవకాశం వచ్చిందని ‘ఊపిరి’ చేశా. మరో సినిమా చేయబోతున్నా. మంచి అవకాశాలొచ్చినప్పుడు ఇతర భాషల్లో నటిస్తాను. తెలుగు ప్రేక్షకులను వదిలి వెళ్లను. ఇటీవల ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమా క్లైమాక్స్‌ రెండు రీల్స్‌ చూశా. బాగుంది. పూర్తిగా చూడాలనుకుంటున్నా.

► ‘దేవదాస్‌’ పది రోజులు మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా హిట్‌ అయితే సీక్వెల్‌ చేస్తాం. ‘బంగార్రాజు’ కథ రెడీ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు