కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

26 Jul, 2019 00:25 IST|Sakshi
అజిత్, నాగార్జున, రాహుల్‌ రవీంద్రన్‌

– నాగార్జున

‘అద్భుతం.. అమోఘం.. ఇటువంటి పథకం శ్రీకృష్ణుడు కూడా మహాభారతంలో వేయలేదు’ అంటూ నాగార్జున డైలాగ్‌తో ‘మన్మథుడు 2’ ట్రైలర్‌ విడుదలైంది. నాగార్జున, రకుల్‌ప్రీత్‌సింగ్‌ జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. వయాకామ్‌ 18 స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున, పి.కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌ 9న విడుదల కానుంది. గురువారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘వయాకామ్‌తో అన్నపూర్ణ స్టూడియోస్‌ భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి. ఏ సమస్యా లేకుండా సినిమా చాలా స్మూత్‌గా పూర్తయింది. వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ మాకు కొండంత ధైర్యం ఇచ్చారు. నిర్మాతలతోపాటు డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్‌ అందరూ సంతోషంగా ఉండాలని ముందు నుంచి ప్రణాళికతో ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. త్వరలో జరగనున్న ‘మన్మథుడు జర్నీ’ ప్రోగ్రామ్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడతాం’’ అన్నారు.

అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాగార్జున సమాధానం ఇస్తూ – ‘‘మన్మథుడు’ సినిమా వచ్చి 17 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ‘మన్మథుడు 2’ వస్తోంది. ఈ రెండిటిలో ఏది ఎక్కువగా ఎంజాయ్‌ చేశానంటే చెప్పలేను. విజయ్‌ భాస్కర్‌గారితో చేసిన ‘మన్మథుడు’ చాలా ఈజీగా, హ్యాపీగా ఎలా సాగిందో ఈ సినిమాకు కూడా అంతే ఎంజాయ్‌ చేశాం. ఈ చిత్రంలో సమంత నటిస్తుందని రాహుల్‌ చెప్పేవరకు నాకు తెలియదు. తనతో ‘మనం, రాజుగారి గది 2’ సినిమాలు చేశాను. తను నా కోడలైన తర్వాత మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నాను.

ఇది ‘మన్మథుడు’ సీక్వెల్‌ కాదు. ఆ పాత్రలకు, కథకు ఎక్కడా సంబంధం లేదు. అందులో, ఇందులో నేనే హీరో కాబట్టి టైటిల్‌ మాత్రం వాడుకున్నాం. ‘అన్‌టచ్‌బుల్స్‌’ అనే ఫ్రెంచ్‌ సినిమా హక్కులు కొని ‘ఊపిరి’గా రీమేక్‌ చేశాం. స్టూడియో కెనాల్‌లో వారు నిర్మించిన ఓ ఫ్రెంచ్‌ సినిమా హక్కులు కొని ‘మన్మథుడు 2’ చేశాం. అంతేకానీ, ఎవరి కష్టాన్నో కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు. 90 శాతం వినోదాత్మకంగా ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన్మథుడు 2’. ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు.. అందుకు నాది గ్యారంటీ. ‘బంగార్రాజు’ కథ దాదాపు పూర్తి కావొచ్చింది. కల్యాణ్‌ కృష్ణ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు షూటింగ్‌ మొదలుపెడతాం’’ అన్నారు.

బిగ్‌ బాస్‌ చేయడం హ్యాపీ
‘బిగ్‌ బాస్‌’ షో చేయడం చాలా బాగుంది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేస్తున్నప్పుడు బిగుసుకుని కూర్చొని, కొంచెం హుందాగా ప్రవర్తించాల్సి వచ్చేది. కానీ ‘బిగ్‌ బాస్‌’ మాత్రం చాలా సరదాగా ఉంది. ఈ షో 15 దేశాల్లో జరుగుతోంది. వివాదాలు అనేవి గాల్లో కూడా  పుట్టించొచ్చు. ‘బిగ్‌ బాస్‌ 3’ సీజన్‌పై కొందరు వివాదాలు చేశారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, తెలంగాణ పోలీసులు నిజాయతీగా విచారణ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు.

రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు ‘మన్మథుడు’ కరెక్ట్‌ టైటిల్‌. కానీ, నాగ్‌ సార్‌ హీరోగా చేస్తున్నారు కాబట్టి ‘మన్మథుడు 2’ అని పెట్టాం. షూటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి ముందే టైటిల్‌ ఫిక్స్‌ చేశాం. మూడు తరాలుగా పోర్చుగల్‌లో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబం కథ ఇది. కుటుంబ ప్రేక్షకులంతా ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది. ఇందులో సమంత అతిథి పాత్ర చేశారు’’ అన్నారు.

వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ మాట్లాడుతూ– ‘‘హాలీవుడ్‌ సినిమాలు తీసే మీరు తెలుగు చిత్రాలు చేస్తున్నారేంటి? అని కొందరన్నారు. ఇక్కడ ఎందుకు తీయకూడదు? అనిపించింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో హిట్‌ అయిన చిత్రం ఓ తెలుగు రీమేకే. మరో తెలుగు సినిమా కూడా త్వరలోనే హిందీలో పెద్ద మూవీగా నిలవబోతోంది. ఇక్కడి ప్రేక్షకులు సినిమా స్టార్స్‌ని, సినిమాను ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకే టాలీవుడ్‌లో అడుగుపెట్టాం. అన్నపూర్ణ సంస్థలో నాగార్జునగారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ బంధం భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. కథ నచ్చితే ఇతర సంస్థలతోనూ కలిసి చేస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు