అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది

10 Nov, 2019 00:16 IST|Sakshi
బొకాడియా, ఈషానియ

– కేసీ బొకాడియా

‘‘మా నాన్నగారు ఒక్క సినిమా చూసింది లేదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి బోంబేలో పోటీని తట్టుకుని సంజీవ్‌ కుమార్‌తో ‘రివాజ్‌’ సినిమా నిర్మించాను. మా నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో హిట్‌ చిత్రాలే ఎక్కువ. ఇప్పుడు తెలుగులో తొలిసారి సినిమా చేస్తున్నాను. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత బొకాడియా. బాలీవుడ్‌లో పలు హిట్‌ చిత్రాలు తీసిన బొకాడియా ‘నమస్తే నేస్తమా’ అనే సినిమా ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్‌ అతిథి పాత్రలో నటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కేసీ బొకాడియా మాట్లాడుతూ – ‘‘నేను ఎవరి దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేయలేదు. తమిళ దర్శకుడు మణివన్నన్‌తో అర్ధగంట సంభాషించి సినిమాలు తీయడం ప్రారంభించాను. అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అజయ్‌ దేవగన్, షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌లతో సినిమాలు చేశాను.

నేను తీసిన ‘తేరీ మెహర్భానియా’ సినిమా స్ఫూర్తితో ‘నమస్తే నేస్తమా’ సినిమా తీశాను. రెండు కుక్కలు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తీశాం. భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమా తీయాలన్నది నా లక్ష్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్‌ ఉంటాయి. స్టార్స్‌ని పరిచయం చేసిన బొకాడియాగారి సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు ఈషానియ. ‘ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ‘తేరి మెహర్భానియా’కి ఇది పార్ట్‌ 2’’ అన్నారు సమర్పకులు గౌతమ్‌ చంద్‌. నటుడు తాగుబోతు రమేశ్, ఫైట్‌ మాస్టర్‌ బి.జె శ్రీధర్‌ మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు