పెళ్లైన తరువాత నమిత ఫస్ట్‌ మూవీ

19 May, 2018 07:12 IST|Sakshi

చెన్నై: సాధారణంగా అందరి జీవితాలు పెళ్లికి ముందు, ఆ తరువాత అన్నట్టుగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఇందుకు సినిమా వారు అతీతులు కాదు. ముఖ్యంగా కథానాయికల జీవితాల్లో ఈ మార్పు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పెళ్లి అయితే ఇక కథానాయకిగా పనికిరారు అనే పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మారుతోంది. హీరోయిన్‌ సమంత లాంటి అతి కొద్దిమందే దీన్ని బ్రేక్‌ చేస్తున్నారు. ఇక నమిత విషయానికి వస్తే ఇంతకుముందు యువకుల డ్రీమ్‌ గర్ల్‌. 

అడపాదడపా సినిమాల్లో నటిస్తూనే నమిత గత ఏడాది తన బాయ్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కొత్త చిత్రమేదీ చేయలేదు. అయితే అంతకు ముందు నటించిన పొట్టు చిత్రం ఈ నెల 25న తెరపైకి రానుంది. తాజాగా మరో సంచలన చిత్రంలో నటించే అవకాశం నమితను వరించిందనే ప్రచారం జరుగుతోంది. దర్శక నిర్మాత టి.రాజేందర్‌ సుమారు 11 ఏళ్ల తరువాత చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంతో ఈ చిత్రం ఉంటుందని, ఇందులో నమిత ప్రధాన పాత్రను పోషించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వైరల్‌ అవుతోంది.

నటుడు రాధారవి ప్రముఖ నటులు కొందరు నటించనున్న ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇటీవల ఇతర హీరోలతో కలిసి అన్న, మామ వంటి పాత్రలను చేస్తున్న టి.రాజేందర్‌ చాలా కాలం తరువాత ఆయన స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. ఇక నమిత విషయానికి వస్తే వివాహానంతరం నటించడానికి అంగీకరించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. మరి ఈ చిత్రం ఆమె రీఎంట్రీ నట జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందన్నది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు