'మహేశ్ బాబుకు మినహాయింపు ఇవ్వలేం'

12 Jun, 2017 14:22 IST|Sakshi
శ్రీమంతుడు చిత్ర నిర్మాతకు సమన్లు

హైదరాబాద్ : 'శ్రీమంతుడు' చిత్ర నిర్మాత ఎర్నేని నవీన్ కు నాంపల్లి కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా హీరో మహేష్ బాబుకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.  స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని, తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్‌ ఉల్లంఘనే అవుతుందంటూ ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు.  

దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు మహేశ్‌బాబు, కొరటాల శివలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, మహేశ్‌బాబు, కొరటాల శివలకు కింది కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై నాంపల్లి కోర్టు మరోసారి విచారణ జరిపారు. ఈ మేరకు చిత్ర నిర్మాతకు నోటీసులు ఇవ్వడమే కాకుండా హీరో మహేష్ బాబు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు.