కొరటాల శివపై కోర్టు సీరియస్‌

27 Jun, 2017 19:47 IST|Sakshi
కొరటాల శివపై కోర్టు సీరియస్‌

హైదరాబాద్: 'శ్రీమంతుడు' సినిమా దర్శక నిర్మాతలపై నాంపల్లి న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హీరో మహేశ్‌బాబుతో పాటు నిర్మాత ఎర్నేని నవీన్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది. మహేష్ బాబుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని న్యాయస్థానం పునరుద్ఘాటించింది. హైకోర్టు నుంచి గిరిధర్ పేరుతో మహేశ్‌కు మినహాయింపు తీసుకురావడం చెల్లదని స్పష్టం చేసింది.

మరోవైపు దర్శకుడు కొరటాల శివపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు ద్వారా మినహాయింపు కోరడం పట్ల సీరియస్‌ అయింది. గతంలో సమన్లు జారీ చేసినా తమ ఎదుట ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణను ఆగస్టు 7కు కోర్టు వాయిదా వేసింది.

స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని, తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్‌ ఉల్లంఘనే అవుతుందంటూ ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించడంతో విచారణ మొదలైంది.