వాళ్లు కర్త.. కర్మ.. నేను క్రియ

6 Jan, 2019 03:05 IST|Sakshi
బాలకృష్ణ

యన్టీఆర్‌ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించి, నిర్మించిన చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘యన్‌.టి.ఆర్‌ : కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ పంచుకున్న విశేషాలు.

► ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా ఒక ఎత్తు అనుకుంటారా?
చాలెంజ్‌ అనుకోలేదు. గొప్ప అవకాశం అనుకున్నాను. విధి మనకు ఎలాంటి చాలెంజ్‌లు ఇచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని భావిస్తాను. ఏ సినిమా వచ్చినా అది ఎందుకు నాదాకా వచ్చిందో నాకు నేనే ఆలోచించుకుంటా. ఎక్కువ మందితో చర్చలు ఉండవు. టూ మెనీ కుక్స్‌ స్పాయిల్‌ ది బ్రాత్‌ (ఎక్కువ మంది వంటగాళ్లు కూర చెడగొట్టినట్టు) అంటారు కదా అలాగ. అనిపించింది చేసుకుంటూ వెళ్లడమే. ప్రాచీన ఆంధ్ర చరిత్ర సృష్టికర్త గౌతమీపుత్ర శాతకర్ణి, నవీన తెలుగు జాతి సృష్టికర్త ఎన్టీఆర్‌ల కథలను ఒకే దర్శకుడు క్రిష్‌తో చేయడం విశేషం.

► మీ నాన్నగారిలా చేయడం కష్టం అనిపించిందా?
కష్టమేం అనిపించలేదు. ఆయన కేవలం నా తండ్రి మాత్రమే కాదు. దైవం, గురువు, మెంటర్‌ అన్నీ. ఆయన చేసిన పాత్రలన్నీ చేయగలగడం ఈ సినిమాతో కుదిరింది. కర్త, కర్మ అన్నీ అమ్మానాన్నే. నేను కేవలం క్రియ మాత్రమే.

► ఆర్టిస్టుల ఎంపిక ఎలా జరిగింది?
బయోపిక్‌ ఫీల్‌ రావాలంటే తెలిసిన ముఖాలు ఎక్కువ కనిపించకూడదు. ఎందుకంటే కథ నుంచి డైవర్ట్‌ అయిపోతారు. కేవలం సినిమా యాక్టర్‌ అయినప్పటి పోర్షన్‌లో మాత్రమే యాక్టర్స్‌ కనిపిస్తారు. మిగతా సీన్స్‌ కోసం సురభి నాటక కళాకారులను తీసుకున్నాం. యాక్టర్స్‌ కనిపిస్తే కమర్షియల్‌ అయిపోతుంది. ఈ సినిమాను అలా చేయదలుచుకోలేదు.

► రెండు భాగాల కథ ఎలా ఉంటుంది?
ఫస్ట్‌ పార్ట్‌ సినిమాలు, పార్టీని అనౌన్స్‌ చేయడం. రెండో భాగం పార్టీ స్థాపించడం, పార్టీ క్రైసిస్, అమ్మగారు శివైక్యం అవ్వడం ఉంటాయి.  ఇది అమ్మానాన్నల కథ.  కేవలం వాళ్లమీదే ఈ సినిమా ఉంటుంది.  

► ఈ జర్నీ ఎమోషనల్‌గా సాగిందనుకోవచ్చా?
అవును. చాలా వరకు. నాన్నగారి వైఖరి నాకు తెలుసు,  అమ్మగారి సెంటిమెంట్సూ నాకు తెలుసు. అమ్మ మాటకు నాన్నగారు ఎంత విలువ ఇచ్చేవారో చెప్పాం. హరి (హరికృష్ణ) అన్నయ్యతో, నాతో మా మేనమామ ‘రామ్‌ రహీమ్‌’ పిక్చర్‌ తీద్దాం అనుకున్నారు. ముందు చదువు పూర్తి కావాలని నాన్నగారు అనేవారు.  నాన్నగారిని అమ్మగారు అడిగిన వెంటనే ‘సరే చేసుకోమనండి’ అన్నారు. ఇలాంటి బోలెడన్ని విషయాలు ఉంటాయి సినిమాలో.

► మీ క్యారెక్టర్‌ (బాలకృష్ణ) ఉంటుందా?
నాకో ఐడెంటిఫికేషన్‌ ఉంది. దాంతో కథ నుంచి డైవర్ట్‌ అయిపోతారు. అలా అవ్వకూడదు.  అయితే నా పాత్ర ఒక్క సీన్‌లో కనిపిస్తుంది.

► అంటే.. ఏ వయసు పాత్రలో కనిపిస్తారు?
లేదు. లేదు. చంటి బిడ్డగా ఉన్నప్పుడు. ఆ పాత్రను నా మనవడు దేవాన్ష్‌ చేశాడు. బాగా చేశాడు. నాకు నామకరణం చేసే సన్నివేశంలో కనిపిస్తాడు. షూటింగ్‌ టైమ్‌లో ఏడుస్తాడేమో అని చాలా ఏర్పాటు చేసుకున్నాడు క్రిష్‌. బొమ్మలు అవీ ఇవీ తెప్పించాడు. కానీ సీన్‌లో ఎవరు డైలాగ్‌ చెప్పినా వాళ్లను చూసేవాడు. క్లోజప్‌ షాట్‌ కావాలంటే నవ్వాడు. నటన మా బ్లడ్‌లోఉంది కదా (నవ్వుతూ).

► చిన్న ఎన్టీఆర్, మీ అబ్బాయి మోక్షజ్ఞ పాత్రలు  కూడా లేవు కదా?
లెంగ్త్‌ కుదర్లేదు. అంత సమయాభావాన్ని సరిపెట్టలేకపోయాం. నా పాత్రే లేనప్పుడు వాళ్ల  పాత్రలు పెట్టించడం కుదరదు కదా.

► క్రిష్‌ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
విద్యాబాలన్‌గారితో మాట్లాడటానికి ముంబై వెళ్లా. అక్కడ ‘మణికర్ణిక’ షూటింగ్‌ జరుగుతోంది. క్రిష్‌ని కలిశాను. నేను డైరెక్షన్‌ చేసేయనా? అన్నారు. ‘యస్‌.. యు ఆర్‌ మై డైరెక్టర్‌’ అన్నాను.

► డైలాగ్స్‌ గురించి?
ఏమంటివి ఏమంటివి, ‘బొబ్బిలి పులి’లో డైలాగ్స్‌ ఉంటాయి. ఊరికే నేను చెప్పగలుగుతాను అని పెట్టినవి  కాదు. ప్రతి సీన్‌కు ఓ రీజన్‌ ఉంది. నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధం కూడా చూపిస్తాం. మా నాన్నగారికి నేనిచ్చే ఘనమైన నివాళి ఈ సినిమా.

► పొలిటికల్‌ కాంట్రవర్సీలు ఉంటాయా?
అవేం ఉండవు. 1983 ఆగస్ట్‌లో పాలిటిక్స్‌ క్రైసిస్, ఆ తర్వాత అమ్మగారు శివైక్యం అవ్వడంతో సినిమా ముగుస్తుంది. ఇది కేవలం మా అమ్మానాన్నల కథ.

► ఈ సినిమా తర్వాత బోయపాటితో  మూవీ అనౌన్స్‌ చేశారు. రెస్ట్‌ ఎప్పుడు తీసుకుంటారు?
రెస్ట్‌ ఎందుకు? ప్రతి రోజూ నాన్నగారి సినిమాలో ఏదో సీన్‌ చూసి పడుకుంటా. పాజిటివ్‌ ఎనర్జీ ఇస్తుంది. అభిమానులు మా నుంచి సినిమాలు కోరుకుంటారు. ఆర్టిస్ట్‌ నిత్యావసర వస్తువు. వాళ్లకు కావాల్సింది అందిస్తుండాలి. ఇచ్చే ధైర్యం మనకుండాలి.

మరిన్ని వార్తలు