అరుదైన ఘనత

29 Apr, 2015 00:07 IST|Sakshi
అరుదైన ఘనత

 హీరో నందమూరి బాలకృష్ణ నటించగా గత ఏడాది విడుదలైన సూపర్‌హిట్ చిత్రం ‘లెజెండ్’ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంటోంది. తెలుగు చిత్రసీమలో విడుదలైన హాలు మారకుండా, నేరుగా 400 రోజులు (కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ‘మినీ శివ’ థియేటర్‌లో రోజూ నాలుగు ఆటలతో మే 1వ తేదీకి) జరుపుకొంటున్న తొలి చిత్రమనే ఖ్యాతిని సంపాదిస్తోంది. అలాగే పొద్దుటూరు ‘అర్చన’ థియేటర్‌లో సింగిల్ షిఫ్ట్‌తో 400 రోజులు పూర్తి చేసుకుంటోంది. అభిమానుల అండదండలతోనే సాధ్యమైన ఈ ఘనతకు గుర్తుగా వారి సమక్షంలోనే, రానున్న మే 2వ తేదీ సాయంత్రం ఎమ్మిగనూరులోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో చిత్ర యూనిట్ సభ్యులు బహిరంగ సభలో పాల్గొని, భారీ వేడుక చేసుకోనున్నారు బాలయ్య.
 
 తెలుగు చిత్ర పరిశ్రమలో డెరైక్ట్ తొలి వంద రోజుల చిత్రం (జెమినీ ‘బాలనాగమ్మ’ (1942) - మద్రాసులోని వెల్లింగ్టన్ థియేటర్), తొలి 200 రోజుల చిత్రం (‘పాతాళభైరవి’ (1951) - విజయవాడలోని దుర్గాకళామందిరం), తొలి 300 రోజుల చిత్రం (‘అడవి రాముడు’ (1977)- విశాఖపట్నంలోని అలంకార్) తర్వాత ఇన్నేళ్ళకు మరో రికార్డు రన్ సినిమా వచ్చిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న విజయోత్సవానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా, హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, చిత్ర నిర్మా తలతో సహా ‘లెజెండ్’ చిత్ర యూనిట్ మొత్తం హాజరవుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా