ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద బాలకృష్ణ నివాళి

28 May, 2020 09:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నేడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు 97వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న బాలకృష్ణ.. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణతో పాటుగా ఆయన సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. (చదవండి : ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయం..)

మరోవైపు ఎన్టీఆర్‌ మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌లు కూడా ట్విటర్‌ వేదికగా ఆయనను గుర్తుచేసుకుని.. నివాళులర్పించారు. ‘మీరు లేని లోటు తీరనిది. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. ‘మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత’ అని కల్యాణ్‌రామ్‌ పోస్ట్‌ చేశారు. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌లు నేడు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా