ఆ రిపోర్ట్స్ విని మథన పడ్డా! : ఎన్టీఆర్

14 Sep, 2016 23:36 IST|Sakshi
ఆ రిపోర్ట్స్ విని మథన పడ్డా! : ఎన్టీఆర్

‘‘ ‘జనతా గ్యారేజ్’ విడుదల రోజు రకరకాల రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొరటాల శివపై, కథపై నేను పెట్టుకున్న నమ్మకం, అభిమానులకు ఇచ్చిన మాట తప్పు కాకూడదే అని లోలోపల మథన పడ్డా. ఫైనల్‌గా ప్రేక్షక దేవుళ్లు, అభిమానుల నుంచి రిపోర్ట్స్ వింటుంటే.. మీలో ఈ ఆనందం చూడ్డానికి ఇన్నేళ్లు పట్టిందా? అనిపించింది’’ అని చిన్న ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మించిన ‘జనతా గ్యారేజ్’ ఇటీవల విడుదలైన విషయం విదితమే.
 
 ఈ చిత్రం సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ- ‘‘నేను, మీరు (అభిమానులు) ఒక తల్లీ బిడ్డలం కాదు. రక్తం పంచుకుని పుట్టలేదు. కానీ, అభిమానం అనే ఒక బంధం మిమ్మల్ని, నన్ను కలిపింది. ఈ చిత్రవిజయంతో అభిమానుల ముఖాల్లో సంతోషం చూడటంతో పాటు నా తల్లితండ్రుల షష్టిపూర్తి రోజు మంచి గిఫ్ట్ ఇచ్చా. ఇలాంటి విజయం కోసమే నేను ఇన్నేళ్లు ఆగాను. ఈ చిత్రవిజయంతో అభిమానుల ముందు తలెత్తుకునేలా చేసిన శివకు ఆజన్మాంతం రుణపడి ఉంటా’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ- ‘‘తారక్‌కి సక్సెస్ కొత్త కాదు.
 
 కానీ, ఈ సక్సెస్‌లో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. అభిమానుల ఆదరణ ఇలాగే ఉంటే తారక్ ఇటువంటి చిత్రాలు మరెన్నో చేస్తారు’’ అన్నారు. ‘‘ నేను, తమ్ముడు గూబ గుయ్‌మనేలా ఎప్పుడు హిట్ ఇస్తామా? అని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాం. అలా కొడితే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో ఫ్యాన్స్  చూపించారు. నా తమ్ముడితో పాటు నందమూరి అభిమానుల ఆకలిని ఇంత పెద్ద హిట్‌తో తీర్చిన కొరటాలకు, మైత్రీ మూవీస్‌కి కృతజ్ఞతలు’’ అని హీరో కల్యాణ్‌రామ్ చెప్పారు. సుకుమార్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, డీవీవీ దానయ్య, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా