ట్యాప్‌ గుర్తుకు ఓటేయండి!

5 Nov, 2017 00:32 IST|Sakshi

ప్రతి ఊరు... ప్రతి ఇల్లు... నియోజకవర్గమంతా చుట్టేస్తున్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌. ‘ట్యాప్‌ గుర్తుకు ఓటేయండి’ అని ప్రజల్ని కోరుతున్నారు. ట్యాప్‌ గుర్తుకు ఓటేయడం ఏంటి? ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరారా? లేదా కొత్తగా పార్టీ ఏదైనా ప్రారంభించారా? అని ఏవెవో ఊహించుకోకండి! ఎందుకంటే... ఆయన ఓట్లు వేయమంటున్నది రీల్‌ లైఫ్‌లోనే! ఉపేంద్ర మాధవ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఎమ్మెల్యే’. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి... అనేది ఉపశీర్షిక. ఇటీవలే ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సన్నివేశాలను చిత్రీకరించినట్టు ఉన్నారు.

‘‘వీరభద్రాపురం నియోజకవర్గ ప్రజలు ట్యాప్‌ గుర్తుకే ఓట్లు వేసి అత్యంత మెజారిటితో గెలిపించ ప్రార్థన. మీ కల్యాణ్‌! ట్యాప్‌ గుర్తుకే మన ఓటు’’ అని రాసిన వాల్‌ పోస్టర్లు, పాంప్లెట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌ ఎమ్మెల్యేగా నటించబోతున్నారని ప్రేక్షకులు డిసైడ్‌ అయ్యారు. వీరభద్రాపురం అనే విలేజ్‌ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో ఉంది. సో... గోదావరి అందాలను ఈ సినిమాలో చూడొచ్చని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి నిర్మిస్తున్నారు.

మరిన్ని వార్తలు