కల్యాణ్‌రామ్ కెరీర్‌లో స్పెషల్ ఎట్రాక్షన్

5 Jul, 2013 06:26 IST|Sakshi
కల్యాణ్‌రామ్ కెరీర్‌లో స్పెషల్ ఎట్రాక్షన్
లెజెండ్రీ ఫ్యామిలీ నుంచి వచ్చిన కథానాయకుడు కల్యాణ్‌రామ్. కానీ ఆయనలో అహంకారం, అతిశయం, అనవసరపు ఆర్భాటం... లాంటి ‘అ’ కారాలు మచ్చుకైనా కనిపించవు. అటు హీరోగా, ఇటు అభిరుచి గల నిర్మాతగా ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్నా కూడా లో ప్రొఫైల్‌లోనే ఉంటారాయన. మనకున్న కథానాయకుల్లో కల్యాణ్‌రామ్ ప్రయాణం నిజంగా ప్రత్యేకం. అందరూ నడిచే దారిలో నడిచే హీరో కాదు తను. ఉన్న స్టార్‌డమ్‌ని క్యాష్ చేసుకోవాలని, విరివిగా సినిమాలు చేసేయాలని ఆయన అనుకోరు. తక్కువ సినిమాలు చేసినా తాత పేరు నిలబెట్టాలనే కసితో కల్యాణ్‌రామ్ సినిమాలు చేస్తారు. 
 
 జయాపజయాలకు అతీతంగా కెరీర్ సాగిస్తున్న ఈ నందమూరి అందగాడి పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఆయన నటించి, నిర్మించిన చిత్రం ‘ఓం’. త్రీడీ టెక్నాలజీతో రూపొందిన తొలి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. సునీల్‌రెడ్డి దర్శకుడు. కృతి కర్బందా, నికిషా పటేల్ కథానాయికలు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ -‘‘అన్ని రకాల ప్రేక్షకులనూ అలరించేలా ఈ చిత్రం రూపొందింది. నా కెరీర్‌లోనే ఈ సినిమా ఓ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. అంచనాలను మించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. 
 
 అచ్చు, సాయికార్తీక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల్ని ఇటీవలే విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని నా నమ్మకం’’ అన్నారు. కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: అజయన్ జోసఫ్ విన్సెంట్, ఎడిటింగ్: గౌతంరాజు, స్టీరియో గ్రాఫర్స్: డేవిడ్ మైక్ టేలర్, మార్కస్ మాజాడోన్‌స్కీ, నిర్మాణం: ఎన్టీఆర్ ఆర్ట్స్.